భూ హక్కులపై మల్లగుల్లాలు

ప్రధానాంశాలు

భూ హక్కులపై మల్లగుల్లాలు

సమస్యల పరిష్కారానికి ఏడాదిలో మూడో కమిటీ 

హరీశ్‌రావు నేతృత్వంలో ఉప సంఘం ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: భూ హక్కుల సమస్యలకు పరిష్కారం చూపడంలో రెవెన్యూశాఖ మల్లగుల్లాలు పడుతోంది. భూములు, ధరణి పోర్టల్‌ సమస్యలపై ఇప్పటికే రెండు కమిటీలు ఏర్పాటు కాగా.. తాజాగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మరో కమిటీ ఏర్పాటైంది. వాస్తవానికి గతేడాది నవంబరు ముందు వరకు భూ పరిపాలనలో భాగంగా యాజమాన్య హక్కుల కల్పన, వివాదాలను రెవెన్యూశాఖే పరిష్కరించేది. ధరణి పోర్టల్‌ ప్రారంభం అనంతరం తహసీల్దార్లు రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్లకు పరిమితమయ్యారు. సమస్యల పరిష్కార బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించగా వారు ఇతర కార్యకలాపాల ఒత్తిడితో పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. వాట్సప్‌, మెయిల్‌, మీసేవ, ధరణి పోర్టల్‌ ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తులను కొన్ని జిల్లాల్లో పట్టించుకోవడం లేదు.

పాసుపుస్తకాలున్న వారి వివరాలే ఆన్‌లైన్‌లో..

2017 సెప్టెంబరుకు ముందు మా భూమి (వెబ్‌ల్యాండ్‌) ద్వారా భూముల నిర్వహణ ఉండేది. ప్రభుత్వ, ప్రైవేటు తదితర భూముల వివరాలన్నీ ఆ వెబ్‌సైట్లో కనిపించేవి. ఖాస్రా పహాణీ, 1బీ, ఆర్‌వోఆర్‌, భూమి పటం తదితర వివరాలను భూ యజమాని తెలుసుకునేందుకు వీలుండేది. రాష్ట్ర ప్రభుత్వం భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) చేపట్టిన తరువాత పాసుపుస్తకం అందినవారి వివరాలు తప్ప.. అందనివారి వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. కొన్ని జిల్లాల్లో యజమానులు మారినా పాత యజమానుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అచ్చుతప్పులు, ఆధార్‌ నంబర్లు, కులం, స్త్రీ, పురుష భేదం, సర్వే సంఖ్యల్లో తప్పులు, విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులు, అసైన్డ్‌ రైతుల వివరాల నమోదులో లోపం తదితర సమస్యలు తలెత్తాయి. సమస్యలపై ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్లు సూచించడం గ్రామీణ రైతులను ఇబ్బందులపాలు చేస్తోంది. కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకోగానే బాధితుల చరవాణికి సంక్షిప్త సందేశం వస్తోంది. ఆ తర్వాత నెలలు గడుస్తున్నా పరిష్కారమైందో లేదో తెలియడం లేదు. కొత్త చట్టం అమలులోకి వచ్చాక తమ గోడును ఎవరికి చెప్పాలనేదానిపై స్పష్టత లేదని బాధితులు వాపోతున్నారు.

గతంలోనూ రెండు కమిటీలు..

ధరణిని ప్రారంభించిన నెల రోజులకే ఆ పోర్టల్లో తలెత్తిన సమస్యలపై గతేడాది డిసెంబరులో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఉప సంఘం కొన్ని సూచనలు చేసింది. భూ సమస్యలపై సత్యశారద నేతృత్వంలో ఐఏఎస్‌ అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేశారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రామయ్య నేతృత్వంలోనూ సమస్యలపై అధ్యయనం కొనసాగింది. ధరణి పోర్టల్లో కొన్ని ఐచ్ఛికాలను ఏర్పాటు చేసినా వాటి అమలు సక్రమంగా లేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. మంత్రి కేటీఆర్‌, ఇతర మంత్రులకు సామాజిక మాధ్యమాల్లో కుప్పలుగా విజ్ఞాపనలు వస్తున్నాయి. తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘమైనా సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కారానికి సూచనలు చేయాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని