‘పీజీ స్వీపర్‌’ రజనికి మంచి కొలువు

ప్రధానాంశాలు

‘పీజీ స్వీపర్‌’ రజనికి మంచి కొలువు

అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా నియామకం
మంత్రి కేటీఆర్‌ చొరవతో ఊరట
‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెస్సీ ఫస్ట్‌ క్లాస్‌లో పాసై కూడా పారిశుద్ధ్య కార్మికులిగా బతుకీడుస్తున్న రజనికి చదువుకు తగ్గ కొలువు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా నియమించింది. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు సోమవారం ఆమెను తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ‘మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంద’ని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తగిన ఉద్యోగం కల్పిస్తుందని కేటీఆర్‌ హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఆమెకు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ అంశాన్ని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.


కదిలించిన కథనం

రంగల్‌ జిల్లాకు చెందిన రజని ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఫస్ట్‌ క్లాస్‌లో పాసై, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీకి అర్హత పొందారు. పెళ్లి తర్వాత భర్త అనారోగ్యం వంటి పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ భారం రజనిపై పడగా సరైన ఉద్యోగం లభించక కూరగాయలు విక్రయించారు. విధిలేని పరిస్థితిలో జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరారు. ఈ నేపథ్యంలో రజని దీనగాథను ‘ఎమ్మెస్సీ ఫస్ట్‌ క్లాస్‌... ఉద్యోగం స్వీపర్‌’ శీర్షికన ‘ఈనాడు’ ప్రచురించింది. ఇది మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన కొలువు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. రజని కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న రెండు ఫార్మా కంపెనీలు పరిశోధకురాలిగా అవకాశం కల్పించేందుకు ముందుకు వచ్చాయి. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌లో అవుట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పించనున్నట్లు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రి నిర్వాహకులు తమవద్ద విధుల్లో చేరాలని కోరారు. మరికొందరు ఇతరత్రా తోడ్పాటునందించేందుకు ముందుకు వచ్చారు.


అందరికీ కృతజ్ఞతలు: రజని

జీహెచ్‌ఎంసీలో అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా నియమించినందుకు మంత్రి కె.టి.రామారావుకు రజని కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి.. తనను ఆందోళన చెందవద్దన్నారని చెప్పారు. తన కష్టాలపై కథనం రాసి వెలుగులోకి తెచ్చిన ‘ఈనాడు’కు జీవితాంతం రుణపడి ఉంటానంటూ కృతజ్ఞతలు చెప్పారు. తనకు ఉద్యోగాలిస్తామన్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.


అత్యుత్తమ క్షణాలు ఇవి: కేటీఆర్‌

రజనితో మాట్లాడిన అనంతరం మంత్రి స్పందిస్తూ రోజంతా తీరిక లేకుండా గడుపుతున్న తనకు ఇవి అత్యుత్తమమైన క్షణాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.కొత్త జీవితంతో ముందుకు సాగాలని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.


 Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని