కొత్త జోనల్‌ విధానం అమలులో జాప్యం

ప్రధానాంశాలు

కొత్త జోనల్‌ విధానం అమలులో జాప్యం

జిల్లాల వారీగా ఖరారు కాని ఉద్యోగుల సంఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర కొత్త జోనల్‌ విధానం పూర్తిస్థాయి అమలులో జాప్యం జరుగుతోంది. జిల్లాల వారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారుతో పాటు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని సొంత జోన్లకు బదిలీ, ఆర్డర్‌ టు సర్వ్‌ విధానం రద్దు తదితర అంశాలపై సందిగ్ధం నెలకొంది. గత జూన్‌ 30న రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా జిల్లా, జోనల్‌, బహుళ జోనల్‌ ఉద్యోగుల విభజన జరిగింది. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఏయే జిల్లాలకు ఎంత మంది ఉద్యోగులుండాలో తేల్చేందుకు సర్కారు చేపట్టిన కసరత్తు పూర్తి కాలేదు. జిల్లాల్లో ఆయా శాఖల వారీగా లెక్క తీసి, రాష్ట్రస్థాయిలోనూ ఎంత మంది ఉద్యోగులు ఉండాలనేది తేల్చాలి. సమన్వయ లోపం వల్ల ఈ వివరాలు రాలేదు.  2011 జనాభా లెక్కలను ప్రాతిపదికన తీసుకోవాలా? లేదా తాజా గణాంకాలనా? అనే విషయంలో స్పష్టత కొరవడింది. వ్యవసాయం, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ తదితర శాఖల్లో ఉద్యోగుల పరిధి ఎక్కువగా ఉన్నందున దాన్ని కొనసాగించాలా లేదా కొత్తగా పునర్‌వ్యవస్థీకరించాలా అనే దానిపై మీమాంస ఏర్పడింది. పోలీసుశాఖలో జిల్లాల వారీగా ఉద్యోగుల సంఖ్యపైనా కొంత అయోమయం నెలకొంది. జిల్లాల జనాభానా.. లేక ఎంత జనాభాకు ఎంత మంది పోలీసులుండాలనే జాతీయ సగటును పరిగణనలోనికి తీసుకోవాలా అనేదానిపై అస్పష్టత ఉంది.

కొత్త జోనల్‌ వ్యవస్థ అమలులోకి వచ్చిన అనంతరం గణాంకాలను పరిశీలించగా... దాదాపు ఎనిమిది వేల మంది ఇతర జోన్లలో ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలింది. ప్రధానంగా 2018 తర్వాత నియమితులైన వారిలో అధికశాతం మంది సొంత జోన్లలో లేరు. కొత్త జోనల్‌ విధానంలో అధికారులు, ఉద్యోగులు తమ తమ జోన్ల పరిధిలోనే ఉండాలి. దీనికి అనుగుణంగా ఆయా ఉద్యోగులు బదిలీ కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 2016 అక్టోబరు నుంచి 2019 జనవరి వరకు జరిగిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సందర్భంగా దాదాపు అయిదువేల మందిని  మాతృజిల్లాల నుంచి ఇతర జిల్లాలకు సేవల ఉత్తర్వు (ఆర్డర్‌ టు సర్వ్‌) కింద బదిలీ చేశారు. తమను సొంత జిల్లాలకు పంపాలని వారు కోరుతున్నారు.

కొత్త జోనల్‌ విధానం కింద జిల్లాల వారీగా ఉద్యోగుల సంఖ్యను గుర్తించిన తర్వాత ఇప్పుడున్న ఖాళీ పోస్టులను మంజూరు చేయాలని, అనంతరం మొత్తంగా ఖాళీలను గుర్తించి భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ విధానం అనుకూలంగా ఉన్నా... కొత్త పోస్టులు మంజూరు చేస్తే వాటి నియామకాల కోసం ఒత్తిడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ప్రక్రియ ముందుకుపడటం లేదు. ఈ అంశంతో కొత్త నియామకాలు జరగడం లేదు. ఇటీవల మంత్రిమండలి సమావేశంలోనూ ఈ అంశం చర్చకు రాగా సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి, స్పష్టత తేవాలని ఆదేశించారు. అది అమలు కాలేదు.


సీఎం ఆదేశాలు అమలు చేస్తేనే..
- మామిళ్ల రాజేందర్‌, టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు

సీఎం కేసీఆర్‌కు అన్ని అంశాలపై స్పష్టత ఉంది. ఆయన ఆదేశాలను అధికారులు అమలు చేస్తే అన్నింటికీ¨ పరిష్కారం లభిస్తుంది. కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య సమాచారం అధికారులు తీసుకుంటున్నారు. దానికనుగుణంగా ఖాళీలను గుర్తించి, మంజూరు చేస్తే... మరిన్ని ఉద్యోగ నియామకాలు జరిగే వీలుంది. దసరా నాటికి జోనల్‌ వ్యవస్థ కొలిక్కి వస్తుందని విశ్వసిస్తున్నాం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని