ఏపీలో త్వరలో ఆన్‌లైన్‌ సినిమా టికెట్లు

ప్రధానాంశాలు

ఏపీలో త్వరలో ఆన్‌లైన్‌ సినిమా టికెట్లు

చిత్ర పరిశ్రమ నుంచి సంపూర్ణ మద్దతు
ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నాని వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా హాళ్లలో త్వరలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వమే టికెట్ల విక్రయాన్ని చేపట్టనున్నట్లు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, పలువురు నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యాలతో సచివాలయంలో మంత్రి నాని సోమవారం సమావేశమయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన భేటీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రముఖ నటుడు చిరంజీవి ప్రతిపాదించిన డిమాండ్లపైనా చర్చించారు. పండుగ సమయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్నారు కదా? మేం పెంచితే తప్పేంటని ఓ థియేటర్‌ యజమాని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలోని ఒక నగర పంచాయతీలో ఆసియాలోనే నంబర్‌ వన్‌గా మల్టిప్లెక్స్‌ థియేటర్‌ కట్టానని, ప్రస్తుత జీవో ప్రకారం నగర పంచాయతీ స్లాబు ప్రకారం టికెటు ధర వసూలు చేయాలంటే ఎలా సాధ్యమని ఓ నిర్మాత ప్రశ్నించినట్లు తెలిసింది.

పారదర్శకంగా టికెట్ల ధరలు

‘సినిమాలపై ఉన్న ఆపేక్షని ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ప్రేక్షకులు ఎవరినీ ప్రశ్నించడానికి వీల్లేని రీతిలో పారదర్శకతతో టికెట్‌ ధరలు నిర్ణయిస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తెలియజేస్తాం. ఈ విధానానికి సినీ ప్రముఖుల ఆమోదం లభించడం హర్షణీయం. సినీ పరిశ్రమకు సంబంధించి పెండింగ్‌ జీవోలను త్వరగా విడుదల చేయాలన్న చిరంజీవి విన్నపం సహా.. ప్రజలకు ఇబ్బంది లేని ఏ కోరిక ఎవరు కోరినా ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు సోదరభావం ఉంది’’అని మంత్రి నాని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కావాలని సినీ పరిశ్రమల తరఫున మేమే ప్రభుత్వాన్ని అడిగామని నిర్మాత సి.కల్యాణ్‌ తెలిపారు. 2007లో ఉన్న టికెట్‌ ధరల ప్రకారమే ఇప్పుడు జీవో విడుదల చేశారని దీన్ని సవరించాలని కోరామని నిర్మాత ఆదిశేషగిరిరావు చెప్పారు. చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని మరో నిర్మాత డీఎన్‌వీ ప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.


చిత్ర పరిశ్రమను ఆదుకోరూ!

కిర్లంపూడి, న్యూస్‌టుడే: చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు సీనియర్‌ నటులు కోరినట్లుగా సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించేలా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి సోమవారం ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని