ఆర్టీసీని పరిరక్షిస్తాం

ప్రధానాంశాలు

ఆర్టీసీని పరిరక్షిస్తాం

కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే నష్టాలు
సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఆర్టీసీని పరిరక్షిస్తాం. ఆస్తులు విక్రయించే యోచన లేదు. వృద్ధి చేస్తాం. ఆదాయం పెంచటమే ప్రధాన లక్ష్యం. జీతాల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తాం’ అని తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. ఇక్కడి బస్‌భవన్‌లో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించి విలేకరులతో మాట్లాడారు. ‘ఆర్టీసీని ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం. సంస్థను పరిరక్షించేందుకు పూర్తిస్థాయి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను, ఛైర్మన్‌గా నన్ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. సీఎం అంచనాల మేరకు పని చేస్తాం. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారింది. కరోనాతో పాటు కేంద్రం ప్రభుత్వ విధానాలు కూడా ఒక కారణం. రోజు వారీగా రూ.13 కోట్లు రావాల్సిన ఆదాయం, రూ.పది కోట్లకు పడిపోయింది. డీజిల్‌ ధర లీటరు రూ. 32 నుంచి రూ.95 దాటింది. ఫలితంగా ఆర్టీసీపై భారం అనూహ్యంగా పెరిగింది. ఆ స్థాయిలో ఛార్జీలు పెంచలేని పరిస్థితి. వివిధ దేశాల్లో ప్రజారవాణా తీరుతెన్నులను గతంలో పరిశీలించా. అక్కడ ప్రజలు బస్సులు వచ్చేంత వరకు వేచి ఉంటారు. అక్కడ టైమ్‌ పాస్‌ చేస్తారు. ఆ మేరకు సదుపాయాలు ఉంటాయి. ఇక్కడ ఆ పరిస్థితులు లేని మాట వాస్తవమే. బస్సు రావటం ఆలస్యమైతే ఏది అందుబాటులో ఉంటే అందులో ప్రయాణించేందుకు వెళ్లిపోతున్నారు. ఆ పరిస్థితుల మారాలి. విదేశాల్లో మాదిరిగా బస్సుల రాకపోకలు ప్రయాణికులకు తెలిసేందుకు ఏర్పాట్లు చేయాలన్న ఆలోచన ఉంది. జీపీఎస్‌ను కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం’ అని అన్నారు


త్వరలో రూ.14 కోట్లకు ఆదాయం

‘రోజువారీ ఆదాయం ప్రస్తుతం రూ.11-12 కోట్ల వరకు వస్తుంది. కరోనా కారణంగా తగ్గించిన సర్వీసులను 95 శాతం పునరుద్ధరించాం. త్వరలో ఆదాయం రూ.13 కోట్లకు చేరుకుంటుంది. ఆ మొత్తాన్ని రూ. 14 కోట్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. ఆదాయం కన్నా ఎక్కువగా ఉన్న ఖర్చులను ఎలా తగ్గించాలన్న అంశంపై దృష్టి పెడతాం. ప్రతి బస్సుకు ఆరుగురు సిబ్బంది ఎక్కువ ఉన్నారు. రానున్న రోజుల్లో జీతాలు సకాలంలో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌కు అన్నీ సులువే. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే ఆర్టీసీ అగ్రస్థానంలో ఉండేది. ప్రస్తుతం పరిస్థితి దెబ్బతింది. పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం’ అని బాజిరెడ్డి అన్నారు. బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ విఠల్‌రావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ హాజరయ్యారు.


 Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని