పంజాబ్‌ సీఎంగా చన్నీ ప్రమాణం

ప్రధానాంశాలు

పంజాబ్‌ సీఎంగా చన్నీ ప్రమాణం

ఉప ముఖ్యమంత్రులుగా రణధవా, సోనీ

చండీగఢ్‌: పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోమవారం ప్రమాణం స్వీకరించారు. ఆయనతో పాటు సుఖ్‌జిందర్‌ సింగ్‌ రణధవా, ఒ.పి.సోనీల చేత రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు. వీరిద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వారిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తదితరులు ఉన్నారు. రెండ్రోజుల క్రితం సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్‌ సింగ్‌ మాత్రం మొహం చాటేశారు. చిన్న ఇళ్లకు ఉచితంగా తాగునీరు ఇవ్వడంతో పాటు విద్యుత్తు బిల్లుల భారాన్ని తగ్గిస్తానని నూతన సీఎం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. తానొక సామాన్యుడిని, పేద కుటుంబానికి చెందినవాడినని చెప్పారు. తాను కొన్నాళ్లు రిక్షా తొక్కానని, తన తండ్రి టెంట్‌ హౌస్‌ నడిపేవారని గుర్తు చేసుకున్నారు. సీఎంగా ఎంపిక చేసినందుకు అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.  

..అప్పుడే గుర్తొస్తారు: మాయావతి

త్వరలో జరగబోయే ఎన్నికల్లో దళితుల ఓట్లను చేజిక్కించుకునే ఉద్దేశంతోనే ఎస్సీ నేత చన్నీకి కాంగ్రెస్‌ అవకాశం కల్పించిందని భాజపా, బీఎస్పీ విమర్శించాయి. కాంగ్రెస్‌ది ఎన్నికల ఎత్తుగడ అనీ, దీనిపై దళితులంతా అమ్రత్తంగా ఉండాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పిలుపునిచ్చారు. సమస్యల్లో ఉన్నప్పుడే కొన్ని పార్టీలకు దళితులు గుర్తుకు వస్తారన్నారు. సమర్థుడైన మరో వ్యక్తి కాంగ్రెస్‌కి దొరికి ఉంటే రాజ్యాంగ రూపకల్పన కసరత్తులో బి.ఆర్‌.అంబేడ్కర్‌ను చేర్చేవారే కాదని చెప్పారు. తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నెగ్గితే ఆయనే సీఎం అభ్యర్థి అని బహిరంగంగా ప్రకటించగలరా అని భాజపా సవాల్‌ విసిరింది. అసెంబ్లీ ఎన్నికలను సిద్ధూ నాయకత్వంలో ఎదుర్కొంటామని పంజాబ్‌ వ్యవహారాల బాధ్యుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌ సోమవారం ఉదయం చేసిన వ్యాఖ్యను భాజపా గుర్తుచేసింది. రావత్‌ వ్యాఖ్యలపై కొంత రగడ చోటు చేసుకుంది. ఇది ముఖ్యమంత్రి పీఠాన్ని అవమానించడమేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు జాకడ్‌ వ్యాఖ్యానించారు. రగడ నేపథ్యంలో అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చన్నీ, సిద్ధూల ఇద్దరి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది.


అభినందించిన మోదీ

నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన చన్నీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పంజాబ్‌ అభివృద్ధికి కేంద్రం బాసటగా నిలుస్తుందన్నారు.


నూతన సీఎం రాజీనామా చేయాలి: ఎన్‌సీడబ్ల్యూ

దిల్లీ: పంజాబ్‌ నూతన సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ రాజీనామా చేయాలని ‘జాతీయ మహిళా కమిషన్‌’ డిమాండ్‌ చేసింది. చన్నీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్‌ అధికారిణికి అభ్యంతరకర సందేశం పంపించి వేధించారని, అలాంటి పరిస్థితి మరొకరికి ఎదురు కాకూడదని కమిషన్‌ అధ్యక్షురాలు రేఖా శర్మ పేర్కొన్నారు. చన్నీని సీఎంగా చేయడం సిగ్గుచేటు, అభ్యంతరకరమని విమర్శించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని