బడులకు పంపాలని ఆదేశించలేం

ప్రధానాంశాలు

బడులకు పంపాలని ఆదేశించలేం

పిల్లలకు భౌతిక తరగతులను పునః ప్రారంభించాలని చెప్పలేం
సుప్రీంకోర్టు స్పష్టీకరణ
విద్యార్థి పిటిషన్‌ తిరస్కరణ

దిల్లీ: దేశంలో కరోనా మూడో ఉద్ధృతి తలెత్తవచ్చన్న హెచ్చరికలను విస్మరించలేమని, ఈ తరుణంలో పిల్లలందర్నీ బడులకు పంపాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దేశ వ్యాప్తంగా భౌతిక తరగతులను పునః ప్రారంభించాలంటూ 12వ తరగతి విద్యార్థి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ఇది పాలనకు సంబంధించిన అంశమని, ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించింది. దిల్లీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థి వేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

న్యాయమూర్తులు కూడా పత్రికలు చదువుతారు...

‘‘పిటిషన్‌ వేసిన విద్యార్థిని ముందు చదువుపై దృష్టి పెట్టమని చెప్పండి. కేసులు, రాజ్యాంగ పరిష్కారాల గురించి ఇప్పుడు అతనికి ఎందుకు? ప్రచారం (పబ్లిసిటీ జిమ్మిక్‌) కోసమే ఆ విద్యార్థి ఈ పిల్‌ వేశాడని చెప్పం. కానీ, ఇది తప్పుగా వేసిన పిటిషన్‌. న్యాయమూర్తులు కూడా పత్రికలు చదువుతారు. మహమ్మారి తొలి రోజుల్లో చాలా దేశాలు బడులను తెరవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో మాకు తెలుసు. ఆర్టికల్‌ 21ఏ ప్రకారం... 6-14 ఏళ్ల వయసు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వాలే జవాబుదారీ. కాబట్టి.. భౌతిక తరగతులు ప్రారంభించేందుకు అవి కూడా ప్రయత్నిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లోని పరిస్థితులు ప్రస్తుతం దిల్లీలో లేకపోవచ్చు. అన్ని రాష్ట్రాలు, వాటి జనసాంద్రత ఒకేలా లేవు. రెండో ఉద్ధృతి ఎంత తీవ్రంగా వచ్చిందో చూశాం. మూడో ఉద్ధృతి రావాలని మేం కోరుకోవడం లేదు. కానీ, కేసులు మళ్లీ పెరగవచ్చన్న నివేదికలను కొట్టిపారేయలేం. దేశంలో టీకా కార్యక్రమం జరుగుతున్నా, ఇంకా చిన్నారులకు వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఉపాధ్యాయులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో టీకాలు అంది ఉండకపోవచ్చు కూడా! ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను బడులకు పంపాలని ఆదేశాలు జారీ చేయలేం’’ అని ధర్మాసనం పేర్కొంది. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌కు అవకాశం కల్పించింది.


జీఎస్టీ కేసుల బదిలీకి నిరాకరణ

తొలుత హైకోర్టులే నిర్ణయించాలన్న జస్టిస్‌ రమణ

దిల్లీ: కేంద్ర జీఎస్టీ చట్టానికి సంబంధించిన కేసులను హైకోర్టుల నుంచి బదిలీ చేయించుకోవడానికి సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ విషయమై వివిధ హైకోర్టుల్లో కేసులు ఉన్నాయని, భిన్నమైన తీర్పులు రాకుండా ఉండేందుకు వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కేంద్రం విజ్ఞప్తి చేసింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ‘‘మొదట హైకోర్టులు నిర్ణయం తీసుకోనీయండి. అది మీకు నచ్చకపోతే అప్పుడు మేం పరిష్కరిస్తాం. హైకోర్టులు భిన్నమైన తీర్పులు ఇస్తే మంచిదే. వాటి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం మాకు కలుగుతుంది’’ అని పేర్కొంది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 16(2)లో ఏయే సందర్భాల్లో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ వస్తుందో వివరిస్తూ అర్హతలు పొందుపరిచారు. దీనిపై వివరణలు కోరుతూ పలు హైకోర్టుల్లో 36 దావాలు పెండింగ్‌లో ఉన్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు తెలిపారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు పరిధిలోని ఇండోర్‌ బెంచ్‌లో కుమ్మిన్స్‌ టెక్నాలజీస్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కూడా బదిలీ చేసుకోవాలని కోరారు. ఇందుకు అంగీకరించని ధర్మాసనం కేసును రెండు నెలల్లో పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని