తప్పుదారి పట్టించేందుకే సినీ ప్రముఖుల పేర్లు

ప్రధానాంశాలు

తప్పుదారి పట్టించేందుకే సినీ ప్రముఖుల పేర్లు

మత్తుమందుల కేసు అభియోగపత్రంలో ఆబ్కారీశాఖ
వెలుగులోకి అందులోని అంశాలు

ఈనాడు, హైదరాబాద్‌: దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకే మత్తుమందుల కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ మాస్కెరెన్హస్‌ సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లుగా ఉందని ఆబ్కారీశాఖ పేర్కొంది. అంతకు మించి ఈ కేసులో సినీ ప్రముఖులకు సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదని స్పష్టం చేసింది. 2017 టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో కెల్విన్‌ ప్రమేయంపై ఆబ్కారీశాఖ గత ఏడాది డిసెంబరులో న్యాయస్థానంలో ఆభియోగపత్రం దాఖలు చేసింది. ఇదే టాలీవుడ్‌ మత్తుమందుల కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మళ్లీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో అభియోగపత్రంలోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఆబ్కారీశాఖ అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మంగళూరులో తాను చదువుకుంటున్నప్పటి నుంచీ మత్తుమందుల వాడకం అలవాటుందని, అక్కడ నుంచి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఈ వ్యాపారంలోకి దిగానని అధికారుల విచారణలో కెల్విన్‌ పేర్కొన్నాడు. డార్క్‌వెబ్‌ ద్వారా ఆర్డర్లు ఇచ్చి రకరకాల మత్తుమందులు తెప్పించేవాడినని, వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాథ్యమాల ద్వారా కోడ్‌ భాషలో ఆర్డర్లు తీసుకొని మత్తుమందులు అవసరమైన వారికి సరఫరా చేసేవాడినని స్పష్టం చేశాడు. ఉన్నతపాఠశాల, కళాశాల విద్యార్థులు మొదలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, సినీ పరిశ్రమకు చెందినవారు, ఈవెంట్‌ నిర్వాహకులు, హోటల్‌ పరిశ్రమకు చెందిన వారు తన ఖాతాదారులని వెల్లడించాడు. పార్కింగ్‌ ప్రదేశాలు, సెల్లార్లు, హోటళ్లు, ఇతర పబ్లిక్‌ ప్రదేశాల్లోనే మత్తుమందులు అందజేసేవాడినని తెలిపాడు. 2013 నుంచి తాను ఈ వ్యాపారంలో ఉన్నానని, 2016లో హైదరాబాద్‌ పోలీసులకు ఒకసారి మత్తుమందుల కేసులో పట్టుబడ్డానని కూడా అంగీకరించాడు. అయితే కెల్విన్‌ వాంగ్మూలం ఆధారంగా పలువురు సినీ ప్రముఖులను విచారించినప్పటికీ మత్తుమందుల వ్యవహారంతో వారికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని, పూరి జగన్నాథ్‌, తరుణ్‌ వంటివారి నుంచి సేకరించిన నమూనాలకు ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించినప్పటికీ మాదకద్రవ్యాలు వాడినట్లు నిర్ధారణ కాలేదు. కెల్విన్‌ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చాడని, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లుగా ఉందని ఆబ్కారీ అధికారులు అభియోగపత్రంలో వివరించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని