ఆంధ్రప్రదేశ్‌ వాదన అర్థరహితం

ప్రధానాంశాలు

ఆంధ్రప్రదేశ్‌ వాదన అర్థరహితం

గోదావరి నీటి మళ్లింపుపై కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

ఈనాడు హైదరాబాద్‌: గోదావరి నుంచి కృష్ణాలోకి నీటిని మళ్లించే చోట టెలిమెట్రీలు ఏర్పాటు చేసి లెక్కగట్టి రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలన్న ఆంధ్రప్రదేశ్‌ వాదన అర్థరహితమని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ స్పష్టంచేసింది. గోదావరి నుంచి కృష్ణాలోకి పలు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ నీటిని మళ్లిస్తోందంటూ ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) జులైలో లేఖ రాశారు. దీనిపై కృష్ణా బోర్డు తెలంగాణ అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ బోర్డు ఛైర్మన్‌కు మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని, వాస్తవానికి ఈ ప్రాంతాలన్నిటికి కృష్ణాబేసిన్‌ నుంచి ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా వేరే బేసిన్‌కు మళ్లించారని పేర్కొన్నారు. ‘‘శ్రీశైలం ఎడమగట్టు కాలువ ద్వారా మున్నేరు వరకు 150 టీఎంసీలను మళ్లించడం, నందికొండ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీటిని సరఫరా చేయడం.. ఇలా పలు పథకాలకు రూపకల్పన చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా ట్రైబ్యునల్‌-1 ముందు ఉద్దేశపూర్వకంగానే వీటిని విస్మరించింది. వేరే బేసిన్‌కు నీటిని మళ్లించడానికి ప్రాధాన్యమిచ్చింది. గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలైనా పూర్తి కాలేదు. శ్రీరామసాగర్‌ ఆయకట్టుకూ సరిగా నీరందలేదు. 75 శాతం నీటి లభ్యత కింద మొదటి దశలో 145.35, రెండోదశలో 22.9 టీఎంసీలు రావాల్సి ఉండగా 20 ఏళ్లలో వచ్చిన సరాసరి 54 టీఎంసీలు మాత్రమే. కృష్ణా, గోదావరి బేసిన్ల భాగస్వామ్య రాష్ట్రాల మధ్య 1971 ఏప్రిల్‌ 19న కుదిరిన ఒప్పందం ప్రకారం కేటాయించిన గోదావరి నీటిని మళ్లించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఉంది. ఇందులో ఇంకో రాష్ట్రం వాటా కోరడానికి లేదు. గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డులోనూ ఈ విషయం స్పష్టంగా ఉంది. 75 శాతం నీటి లభ్యత కింద చేసిన కేటాయింపు నుంచి కృష్ణా బేసిన్‌లోకి మళ్లించి తెలంగాణ వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. 1978 ఆగస్టు 4న జరిగిన ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్‌ పైన కృష్ణా బేసిన్‌లోనే ఈ నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. గోదావరిపై చేపట్టిన మిగిలిన ప్రాజెక్టులకు ఇది వర్తించదు’’ అని లేఖలో తెలంగాణ ఈఎన్‌సీ స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని