తక్షణ అనుమతులే అత్యధికం

ప్రధానాంశాలు

తక్షణ అనుమతులే అత్యధికం

80 శాతం భవన నిర్మాణ దరఖాస్తుల పరిష్కారం

టీఎస్‌-బీపాస్‌ ద్వారా ఆమోదం పొందినవి 38 వేలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల్లో అమలవుతున్న టీఎస్‌-బీపాస్‌లో 80 శాతం దరఖాస్తులు నిర్దేశించిన మేర పరిష్కారమవుతున్నాయి. స్వీయ ధ్రువీకరణ ద్వారా తక్షణ అనుమతి పొందుతున్న భవన నిర్మాణాలే ఇందులో అత్యధికంగా ఉన్నాయి. గత ఏడాది నవంబరులో రాష్ట్ర పురపాలకశాఖ నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతులకు పూర్తి ఆన్‌లైన్‌ విధానమైన టీఎస్‌-బీపాస్‌ను అమలు చేస్తోంది. 75 చదరపు గజాల్లోపు అయితే రూపాయి చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఆమోదం లభిస్తుండగా.. అంతకంటే ఎక్కువ విస్తీర్ణం 500 చదరపు మీటర్లలోపు ఉండే నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా మంజూరు చేస్తున్నారు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే భవనాలు, వాణిజ్య భవనాలకు అయితే సింగిల్‌విండో విధానాన్ని అమలు చేస్తోంది. గత 10 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 47,444 దరఖాస్తులు రాగా ఇప్పటిదాకా 38,115 అనుమతులిచ్చారు. అన్ని విభాగాల్లో 80 శాతం మేర పరిష్కారానికి నోచుకుంటుండగా.. సరైన పత్రాలు, వివరాల్లేని వాటి విషయంలో జాప్యం జరుగుతోందని పురపాలకశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌లో ఉన్న మార్గదర్శకాలను అనుసరిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ఆమోదం లభిస్తుందని చెబుతున్నారు.

డీటీసీపీ పరిధిలో అత్యధిక దరఖాస్తులు

భవన నిర్మాణ అనుమతుల కోసం అత్యధికంగా డీటీసీపీ పరిధిలో దరఖాస్తులు వస్తుండగా తర్వాత స్థానంలో హెచ్‌ఎండీఏ పరిధి ఉండగా మూడో స్థానంలో జీహెచ్‌ఎంసీ ఉంది. 75 చదరపు గజాల్లోపు దరఖాస్తులు జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా ఉంటున్నాయి. పది నెలలుగా జీహెచ్‌ఎంసీలో ఈ కేటగిరిలో 1803 దరఖాస్తులు రాగా 993 మాత్రం అనుమతులు పొందాయి. సుమారు 45 శాతం దరఖాస్తుల వివరాలు సక్రమంగా లేకపోవడం, నిర్దేశించిన మేర సమాచారం లేకపోవడంతో భవన నిర్మాణ అనుమతి ప్రక్రియ పూర్తికాలేదని అధికారులు వివరించారు. ఇది డీటీసీపీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 87 శాతానికి పైగా ఉందన్నారు. వాణిజ్య భవనాలు, 500 చదరపు మీటర్లకు పైబడిన భవనాలకు సింగిల్‌విండో విధానంలో 21 రోజుల్లో అనుమతి లభిస్తుంది. ఈ విధానంలో డీటీసీపీ పరిధిలో 449, హెచ్‌ఎండీఏ పరిధిలో 31, జీహెచ్‌ఎంసీ పరిధిలో 307 దరఖాస్తులను పరిష్కరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని