ప్రధాని మోదీ అమెరికా పయనం నేడు

ప్రధానాంశాలు

ప్రధాని మోదీ అమెరికా పయనం నేడు

ఐరాస సర్వసభ్య సమావేశం, క్వాడ్‌ సదస్సులకు హాజరు

  బైడెన్‌, కమలా హారిస్‌లతో ప్రత్యేక భేటీలు

వాషింగ్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం బయల్దేరి అమెరికా వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఐరాస సర్వసభ్య సమావేశం, క్వాడ్‌ సదస్సుల్లో ఆయన పాల్గొంటారు. ఈనెల 24న శ్వేతసౌధంలో అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌తో, అంతకు ముందురోజు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోదీ భేటీ అవుతారు. 26న తిరిగి భారత్‌కు వస్తారు. బైడెన్‌-మోదీ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్‌ పరిణామాలతో పాటు.. పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. కమలతో భేటీ సందర్భంగా.. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వాతావరణ మార్పులపై మోదీ ఆమెతో చర్చిస్తారు. వీరిద్దరి మధ్య జరిగే తొలి అధికారిక భేటీ ఇదే కానుండటం విశేషం.

వెంట వెళ్లనున్న జైశంకర్‌...

పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌, విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా ఉంటారు. ‘‘బైడెన్‌ అధ్యక్షతన ఈనెల 24న జరిగే ‘క్వాడ్‌’ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రత్యక్షంగా పాల్గొంటారు. సమకాలీన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ‘స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్‌ ప్రాంతం’పై నేతలు తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. అదే రోజున మోదీ-బైడెన్‌ల భేటీ ఉంటుంది. అమెరికా సంస్థలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లతో మోదీ వాషింగ్టన్‌లో సమావేశమవుతారు. తర్వాత ఆయన న్యూయార్క్‌ వెళ్తారు. 25న ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. యూకే, ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న ‘ఆకస్‌’ కూటమి ప్రభావం క్వాడ్‌పై ఉండదు. రెండు కూటములు ఒకటి కాదు’’ అని శ్రింగ్లా చెప్పారు. బైడెన్‌ నిర్వహించే కొవిడ్‌ అంతర్జాతీయ సదస్సులోనూ మోదీ పాల్గొంటారని ఆయన తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని