ఫేస్‌బుక్‌లో కొత్త ‘బూచాళ్లు’

ప్రధానాంశాలు

ఫేస్‌బుక్‌లో కొత్త ‘బూచాళ్లు’

ఖాతాలు హ్యాక్‌ చేసి అశ్లీల వీడియోలతో హల్‌చల్‌  
పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ  
ఈనాడు - హైదరాబాద్‌

సర్‌.. నా ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి కొద్దిరోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు అశ్లీల, అనుచితమైన వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. తొలగిస్తున్న కొద్దీ పదేపదే పెడుతున్నారు.. వాటిని చూసిన మా స్నేహితులు ఫోన్లు చేసి తిడుతున్నారు.. మరికొందరు నా గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు.. ఎలాగైనా వీటికి అడ్డుకట్ట వేసి.. కారకులను పట్టుకోండి.. - ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతి ఇటీవల సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చేసిన వేడుకోలు ఇది.


ఫేస్‌బుక్‌ ఖాతాదారుల్లో చాలామందికి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. నకిలీ ఖాతాలు తెరిచి ఫ్రెండ్స్‌ లిస్టులోనివారందరికీ డబ్బుల కోసం అభ్యర్థనలు పంపుతున్నట్లే తాజాగా.. ఖాతాలను హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఫ్రెండ్స్‌ లిస్టులోని వారికి అశ్లీల, అభ్యంతరకర వీడియోలను పంపుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా సెక్యూరిటీ సెట్టింగ్స్‌ సరిగాలేని ఖాతాలను ఇందుకు ఎంచుకుంటున్నారు. వృత్తి నిపుణులు, యువతులు, మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు భారీగా పెరిగాయి. వారు ఫేస్‌బుక్‌ ప్రతినిధులకు ఈ సమస్య తీవ్రతను వివరించడంతో చర్యలు మొదలయ్యాయి. కంటెంట్‌ ఆధారంగా వెంటనే అలాంటి వాటిని తొలగిస్తున్నారు.

పోలీసుల చొరవతో నియంత్రణ 

ఫేస్‌బుక్‌ ద్వారా వేధింపులు, నకిలీ ఖాతాల ద్వారా మోసాలు, అశ్లీల వీడియోలకు సంబంధించిన ఫిర్యాదులు పెరుగుతుండడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ఫేస్‌బుక్‌ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వాటిని పోలీసులు నేరపూరితమైన పోస్టులుగా ధ్రువీకరిస్తే తాము వెంటనే స్పందిస్తామని వారు చెప్పారు. ఈమేరకు పోలీసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారు అందులో ఎఫ్‌ఐఆర్‌ను అప్‌లోడ్‌ చేసిన వెంటనే ఫేస్‌బుస్‌ ప్రతినిధులు నిందితుడి ఖాతాను తొలగిస్తారు. వీడియోలు, చిత్రాలు కనపడకుండా చర్యలు తీసుకుంటారు. తరచూ ఒకే వ్యక్తి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుంటే వారి ఖాతాలను బ్లాక్‌ చేస్తుంది.

ఈ వేదికగా నేరాలెన్నో..

* ఫేస్‌బుక్‌ విస్తృతి పెరగడంతో ఇదే అదనుగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. యువతులు, విద్యార్థినులను వేధిస్తున్న నేరస్థుల్లో 20 శాతం మంది తప్పుడు పేర్లు, యువతుల పేర్లతో ఖాతాలు ప్రారంభిస్తున్నారు. ఎదుటివారు స్పందించగానే అసభ్యకరమైన, అశ్లీల వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు.

* విద్యార్థినులు, మహిళలను ఆకర్షించేందుకు 20 శాతం మంది నేరస్థులు ఫేస్‌బుక్‌ను వాడుకుంటున్నారు. నకిలీ ఫొటోలతో ఖాతాలు తెరుస్తున్నారు. పరిచయమయ్యాక తమ కోరికను చెబుతున్నారు. తిరస్కరిస్తే వేధింపులకు గురి చేస్తున్నారు. 

* కొందరు యువకులు ఇతర మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం, పురాణ, అవతార పురుషుల చిత్రాలను మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా మార్చి పోస్ట్‌లు పెట్టడం, వీడియోలను అప్‌లోడ్‌ చేయడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు.

* మత ప్రవచనాలను వక్రీకరిస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారంటూ వివిధ మత సంస్థల ప్రతినిధుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి

వెంటనే ఫిర్యాదు చేయండి

మీ ఫేస్‌బుక్‌ ఖాతాలో ఎవరైనా అశ్లీల వీడియోలు పోస్ట్‌ చేసినా, మీ ఖాతాను దుర్వినియోగం చేసినా వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వండి. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నాం. వారి ఫిర్యాదు ఆధారంగా ఎప్పటికప్పుడు నిందితులను అరెస్ట్‌ చేస్తున్నాం. అపరిచితులు పంపే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను తిరస్కరించండి. మీ ఖాతా వ్యక్తిగత ఐచ్ఛికాలు (ప్రైవసీ సెట్టింగ్స్‌) మార్చుకోండి.

- కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌ క్రైమ్స్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని