ఆయిల్‌పామ్‌ లాభదాయకం

ప్రధానాంశాలు

ఆయిల్‌పామ్‌ లాభదాయకం

సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
మంత్రి కేటీఆర్‌
మలేసియా సంస్థ ప్రతినిధులతో భేటీ
సిరిసిల్లలో పరిశ్రమ స్థాపనకు సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలు పెరిగిన నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మళ్లాలని, ఆయిల్‌పామ్‌ను పెద్దఎత్తున సాగు చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సూచించారు. ఎంతో లాభదాయకంగా ఉన్న ఈ పంటను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. త్వరలోనే సిరిసిల్లలో ఈ పరిశ్రమ ఏర్పాటవుతోందని, ఇతర జిల్లాల్లోనూ పరిశ్రమల స్థాపనకు ఆహ్వానిస్తున్నామన్నారు. దీని సాగుపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మలేసియాలో పర్యటిస్తామన్నారు. బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో మలేసియాకు చెందిన పారిశ్రామిక సంస్థ ఫెల్డా గ్లోబల్‌ వెంచర్‌ (ఎఫ్‌జీవీ) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘‘ఎఫ్‌జీవీ సంస్థ సిరిసిల్లలో పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు రావడం అభినందనీయం. ఆయిల్‌పామ్‌ సాగును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. దానిని సాగుచేసే రైతులకు ఎకరాకు.. మొదటి ఏడాది రూ.26 వేలు, తరువాతి రెండేళ్లు ఏటా రూ.5 వేల చొప్పున పెట్టుబడి ప్రోత్సాహకంగా రాయితీ అందించాలని నిర్ణయించాం. అటవీశాఖ, అటవీ అభివృద్ధి సంస్థతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఆయిల్‌పామ్‌ మొక్కలు, నర్సరీలు పెంచాలని ఆదేశించాం. దీంతో పాటు నర్సరీ, విత్తన శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు. ఎఫ్‌జీవీ ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో అనుకూలతలు, అవకాశాల దృష్ట్యా సిరిసిల్లలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చామన్నారు. విత్తనశుద్ధి కర్మాగారం, ఆయిల్‌పామ్‌ మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను కేటీఆర్‌ కోరారు.


తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామినవుతా
కేటీఆర్‌తో ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు

తెలంగాణ ఏర్పడిన తర్వాత అద్భుతంగా ప్రగతి సాధిస్తోందని, వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని క్యాన్సర్‌ చికిత్స నిపుణుడు నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య కార్యక్రమాలకు.. ప్రధానంగా క్యాన్సర్‌ సంబంధిత చికిత్సకు తన మద్దతు ఉంటుందని, వాటిల్లో భాగస్వామినయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రికి వివరించారు. తన వైద్య విద్య, వృత్తి హైదరాబాద్‌లోనే ప్రారంభమైందన్న నోరి దత్తాత్రేయుడు.. రాష్ట్రానికి మరిన్ని సేవలు అందిస్తామన్నారు. దశాబ్దాలుగా లక్షల మందికి వైద్య సేవలు చేసిన దత్తాత్రేయుడిని కలవడం పట్ల మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం తర్వాత అన్ని ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నాయని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలు ప్రారంభించారని కేటీఆర్‌ తెలిపారు.

జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంటు విలీనానికి మద్దతు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో  విలీనం చేయాలన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం ట్విటర్‌లో తెలిపారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కొందరు కోరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తాను కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నానన్న కేటీఆర్‌... మిగతా వారు ఏమంటారని  ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని