కరోనా మృతులకు రూ.50 వేల పరిహారం

ప్రధానాంశాలు

కరోనా మృతులకు రూ.50 వేల పరిహారం

రాష్ట్ర విపత్తు నిధుల నుంచి చెల్లింపు
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల వంతున పరిహారం చెల్లించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) సిఫార్సు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారని పేర్కొంది. ఈ మేరకు ప్రమాణ పత్రం సమర్పించింది. కరోనా నివారణ చర్యల్లో పాల్గొని వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ, భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారని, అవి పొందిన కుటుంబాలకే పరిహారం లభిస్తుందని వివరించింది. భవిష్యత్తులో కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.  అన్ని పత్రాలు సమర్పించిన 30 రోజుల్లోగా సొమ్ము అందుతుందని పేర్కొంది. బాధితులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే దరఖాస్తు ఫారం నింపి, కావాల్సిన పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు వాటిని తనిఖీ చేస్తారు. జిల్లా కమిటీలో కలెక్టర్‌, వైద్య-ఆరోగ్య అధికారి, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు. పరిహారం చెల్లింపులపై ఈ కమిటీయే సిఫార్సు చేస్తుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని