చిక్కుల్లో హక్కులు

ప్రధానాంశాలు

చిక్కుల్లో హక్కులు

హక్కులు తేలని భూమి 3 లక్షల హెక్టార్లు
పోరాటం చేస్తున్న బాధితులు
వందలమందిపై కేసులు..
అందరి చూపూ మంత్రివర్గ ఉపసంఘం వైపే
ఈనాడు, హైదరాబాద్‌, నల్గొండ
ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి
ఈటీవీ, ఖమ్మం

చ్చని అడవుల్లో భూమిపై హక్కుల కోసం ఎడతెగని పోరాటం సాగుతోంది. అటవీశాఖ సిబ్బంది, గిరిజనులు పరస్పర దాడులు చేసుకుంటున్నారు. అడవిపై తమదే హక్కు అని గిరిజనులు, అటవీ భూముల్లో సాగు చెల్లదంటూ అటవీ అధికారులు ఒకరినొకరు అడ్డుకుంటున్నారు. అటవీ భూముల సమస్య ఇలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం తేలకపోవడం మరికొన్ని వివాదాలకు కారణమవుతోంది. 2006లో ప్రభుత్వం జారీ చేసిన పట్టాలు ఉన్నప్పటికీ తమను సాగు చేసుకోనివ్వడం లేదని కొన్నిచోట్ల గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పోడు హక్కుల పోరాటం అటవీశాఖ, గిరిజనుల మధ్య యుద్ధంలా మారింది. ఈ సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఒక దఫా సమావేశం కూడా పూర్తయింది. ఇప్పటికైనా సమస్య పరిష్కారమైతే అదే పదివేలని ఆదివాసీలు ఆశిస్తున్నారు.

ఆదివాసీల వేడుకోలు

హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాల్లో గిరిజనులు జీవిస్తున్నారు. మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 26.96 లక్షల చదరపు కిలోమీటర్లు. వాటిలో 3 లక్షల హెక్టార్లు ఆక్రమణకు గురైనట్లు అంచనా. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలని గిరిజనులు కోరడంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం 2006లో దరఖాస్తులు స్వీకరించింది. 94,778 మంది గిరిజనులకు 8,08,179 లక్షల ఎకరాల మేర హక్కు పత్రాలు జారీ చేయగా, 2.54 లక్షల దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. హక్కు పత్రాలు పొందినవారిలోనూ కొందరు అగ్నిప్రమాదాలు, చెదల సమస్యలతో పత్రాలను కోల్పోయారు. ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హరితహారం లక్ష్యం కింద మొక్కలు నాటేందుకు అటవీశాఖ పోడు భూములను గుర్తించి వెనక్కు తీసుకుంటోంది. ఈ సందర్భంగా జిల్లాల్లో పరస్పర దాడులు, ఘర్షణలు జరుగుతున్నాయి. అడవిని నమ్ముకుని జీవించే తమ పొట్ట కొట్టొద్దని గిరిజనులు వేడుకుంటున్నారు.

ఏళ్ల తరబడి తేలని సరిహద్దులు

మరోవైపు అటవీ, రెవెన్యూశాఖలకు చెందిన 2.18 లక్షల ఎకరాలకు సరిహద్దులు తేలాల్సి ఉంది. 2019-20 సంవత్సరంలో రెవెన్యూ, అటవీ, భూమి కొలతలు- భూ దస్త్రాల నిర్వహణ శాఖలు ఉమ్మడిగా సరిహద్దులు తేల్చేందుకు సిద్ధమయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సర్వే ప్రారంభమైనా పూర్తి కాలేదు. ఇలాంటిచోట ఆక్రమణకు గురవుతున్న భూమి ఏ శాఖకు చెందినదనే స్పష్టతలేదు. ఈ కారణంగా కూడా ఘర్షణలు తలెత్తుతున్నాయి. అటవీ భూముల్లో కాకుండా ప్రభుత్వ భూముల్లోనే తాము సాగు చేసుకుంటున్నామని, తమకు హక్కులు కల్పించాలని కొన్ని జిల్లాల్లో గిరిజనులు కోరుతున్నారు. సర్వే పూర్తయితేగానీ ఏ విషయం తేలదని అధికారులు చెబుతున్నారు. ఇలా కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 21 వేల ఎకరాలు, మంచిర్యాలలో 20,000, మహబూబాబాద్‌లో 12,000, నల్గొండలో 33,121, నిజామాబాద్‌లో 12,000, మెదక్‌ జిల్లాలో 17,947 ఎకరాల భూమికి సరిహద్దులు తేలాల్సి ఉంది.


వివాదాలు..  దాడులు

* జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పందిపంపుల గ్రామంలో 34 సర్వే నంబరులో 600 ఎకరాల భూమి ఉండగా సరిహద్దుల గుర్తింపు సరిగా లేకపోవడంతో రెవెన్యూ, అటవీశాఖ భూములపై స్పష్టత లేదు. ఓ గిరిజన రైతుకు చెందిన పొలంలో హరితహారం మొక్కలు నాటిన సందర్భంగా తలెత్తిన వివాదంలో పెట్రోల్‌ దాడికి పాల్పడ్డారంటూ ఐదుగురు గిరిజనులను అధికారులు అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం ఎర్రారం గ్రామంలోనూ దాడులు చోటుచేసుకోగా కేసులు నమోదయ్యాయి.

* ఇదే జిల్లాలో నెల క్రితం తాడ్వాయి మండలం జలగలంచలో పోడు భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో గిరిజనులకు, అటవీశాఖ అధికారులకు మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇరువర్గాలవారూ పోలీస్‌ కేసులు పెట్టుకున్నారు.

* నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారంలో రెండు నెలల క్రితం పోడు భూమిని స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లగా ఘర్షణ చోటుచేసుకుంది. పెట్రోలు చల్లేందుకు ప్రయత్నించిన కారణంగా ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను అరెస్టు చేశారు.

* ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం ఎల్లన్ననగర్‌లో 18 మందిని అరెస్టు చేశారు. చంద్రుగొండ మండలం సీతాయిగూడెం, సత్తుపల్లి మండలం రేగళ్లగూడెం, ముల్కలపల్లి, దమ్మపల్లి, కారెపల్లి, ఏన్కూరు మండలాల్లోనూ పలు సంఘటనల్లో అనేకమందిపై కేసులు నమోదయ్యాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని