12.49 లక్షల మందిలో జ్వర లక్షణాలు

ప్రధానాంశాలు

12.49 లక్షల మందిలో జ్వర లక్షణాలు

గత 19 వారాల్లో గుర్తింపు
12.10 లక్షల కొవిడ్‌ కిట్ల పంపిణీ
ఇంటింటి సర్వే, ప్రత్యేక ఓపీ ద్వారా సేవలు
హైకోర్టుకు వైద్యఆరోగ్యశాఖ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత 19 వారాల్లో 12,49,064 మందిలో జ్వర లక్షణాలను గుర్తించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో కరోనా అనుమానిత లక్షణాలున్న 12,10,862 మందికి కొవిడ్‌ కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది మే 6 నుంచి నిర్వహిస్తోన్న ఇంటింటి సర్వే, జ్వర క్లినిక్‌ల ద్వారా సానుకూల ఫలితాలు వస్తుండడంతో.. వాటిని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ సన్నాహకాలపై వైద్యఆరోగ్యశాఖ బుధవారం హైకోర్టుకు ఈమేరకు నివేదిక సమర్పించింది. జ్వర క్లినిక్‌లకు వచ్చినవారిలో హైదరాబాద్‌లో అత్యధికంగా 1,29,895 మందిలో జ్వర లక్షణాలను గుర్తించారు. ఇంటింటి సర్వేలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 46,501 మందిలో, మంచిర్యాలలో 43,869, హైదరాబాద్‌లో 42,498 మందిలో ఈ లక్షణాలను నిర్ధరించారు.

నివేదికలోని ముఖ్యాంశాలు

* రాష్ట్రంలో కొవిడ్‌ ప్రారంభం నుంచి ఈ నెల 19 వరకూ 2,58,51,688 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,63,454 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. 2.56% పాజిటివ్‌ రేటు (తొలిదశ ఉద్ధృతిలో 2.56%, రెండోదశలో 2.12%) నమోదైంది. 

* ఈ ఏడాది జులై 16 నుంచి సెప్టెంబరు 19 వరకూ 56,41,350 పరీక్షలు నిర్వహించగా..  28,849 కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటివ్‌ రేటు 0.51% ఉంది.

* జులై 16 నుంచి ఆగస్టు 07 వరకూ రోజుకు సగటున లక్షకు పైగా కొవిడ్‌ పరీక్షలు చేయగా.. ఆ తర్వాత నుంచి ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఆగస్టు 20న 73,899, ఈ నెల 1న 71,402, 10న 51,004, 19న 35,160 పరీక్షలు చేశాం.

* రాష్ట్రంలో 1,328 ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలు అందజేస్తున్నాం. వీటిల్లో 21,846 సాధారణ పడకలు, 21,751 ఆక్సిజన్‌ పడకలు, 11,845 ఐసీయూ వెంటిలేటర్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. 4.2% పడకల్లో ప్రస్తుతం రోగులు చికిత్స పొందుతున్నారు.

* మూడోదశ అంచనాల నేపథ్యంలో పిల్లల కోసం ప్రత్యేకంగా 6 వేల పడకలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

* ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలకు అధిక ధరల వసూలు సహా ఇతరత్రా 813 ఫిర్యాదులు అందగా.. 343 పరిష్కరించి, బాధితులకు రూ.1,70,71,625 తిరిగి అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని