రైతు ఆత్మహత్యలు లేవు!

ప్రధానాంశాలు

రైతు ఆత్మహత్యలు లేవు!

కలెక్టర్లకు లేఖలో వ్యవసాయశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు దాదాపు పూర్తిగా తగ్గిపోయాయని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌, రైతుబంధు, సాగునీటి పథకాలు, మద్దతు ధరలకు పంటల కొనుగోలు, సాగుకు అవసరమైనవన్నీ సరఫరా చేయడం వంటి కార్యక్రమాలతో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రాసిన లేఖలో తెలిపారు.

ఎందుకీ లేఖ...

రైతు ఆత్యహత్య చేసుకుంటే అతని కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. రైతు నిజంగా అప్పుల బాధతోనే, పంటల సాగులో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడా అని విచారణ చేయడానికి ప్రతి జిల్లాలో ‘త్రిసభ్య విచారణ కమిటీ’ని నియమించాలని రెవెన్యూశాఖ గతంలో ఉత్తర్వులిచ్చింది. వ్యవసాయాధికారి, రెవెన్యూ అధికారి, స్థానిక పోలీసు అధికారి సభ్యులుగా ఉండాలని తెలిపింది. కానీ రైతుబీమా పథకం అమల్లోకి వచ్చాక గత మూడేళ్లుగా ఈ పరిహారం ఇవ్వడాన్ని ఆపివేసింది. రైతుల ఆత్మహత్యల వివరాలను ప్రభుత్వశాఖలేవీ అధికారికంగా ప్రకటించడం లేదు. ఆ వార్తలు ప్రసార మాధ్యమాల్లో వచ్చినా అధికారులు నిర్ధారించడం లేదు. ఈ నేపథ్యంలో... ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయని, ఎక్కడైనా అరుదుగా బలవన్మరణం జరిగితేనే జిల్లా వ్యవసాయాధికారిని త్రిసభ్య కమిటీలో సభ్యుడిగా నియమించాలని కలెక్టర్లకు వ్యవసాయశాఖ సూచించింది. కాగా, ఇప్పటికీ పంటలు దెబ్బతిని నష్టాలతో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని