‘పెగాసస్‌’పై విచారణకు నిపుణుల బృందం

ప్రధానాంశాలు

‘పెగాసస్‌’పై విచారణకు నిపుణుల బృందం

ఏర్పాటు చేయనున్న సుప్రీంకోర్టు

వచ్చే వారం ఉత్తర్వులు ఇస్తాం: సీజేఐ జస్టిస్‌ రమణ

ఈనాడు, దిల్లీ: ‘పెగాసస్‌’ నిఘా సాంకేతిక పరిజ్ఞానంపై గురువారం సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. దీనిపై దర్యాప్తునకు సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించనున్నట్టు మౌఖికంగా తెలిపింది. పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులపై నిఘా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం దీన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వచ్చే వారం విడుదల చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. ఇందుకు సంబంధించిన దావాలను ఆయన ఆధ్వర్యంలో జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. పెగాసస్‌ కేసులో ఓ పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సందేర్‌ ఉదయ్‌సింగ్‌ వేరే కేసును ప్రస్తావిస్తున్న సందర్భంగా సీజేఐ జస్టిస్‌ రమణ ఆయనకు ఈ విషయాన్ని చెప్పారు. ‘‘ఈ వారంలోనే కోర్టు ఉత్తర్వులు జారీచేయాలని అనుకొంది. కానీ కోర్టు పరిశీలనలో ఉన్న కొందరు సాంకేతిక నిపుణులు వ్యక్తిగత ఇబ్బందుల కారణంతో ఇందులో భాగస్వాములు కావడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో ఉత్తర్వుల జారీని వాయిదా వేశాం. త్వరలో సాంకేతిక నిపుణుల పేర్లను ఖరారుచేసి, వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేస్తాం’’ అని పేర్కొన్నారు. పిటిషన్‌ దాఖలు చేసిన ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రాం, శశికుమార్‌ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌న్యాయవాది కపిల్‌ సిబల్‌ కొద్ది రోజులుగా కోర్టులో కనిపించకపోవడంతో ఆ విషయాన్ని మీకు చెబుతున్నానని జస్టిస్‌ రమణ తెలిపారు. ధర్మాసనం ఈ నెల 13న పెగాసస్‌పై వాదనలు విని మధ్యంతర ఉత్తర్వులను వాయిదా వేేసిన విషయం తెలిసిందే.

కోర్టు పర్యవేక్షణలో జరగాలి: కాంగ్రెస్‌

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్‌ స్వాగతించింది. ఈ దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలోనే జరగాలని ఆ పార్టీ అధికారి ప్రతినిధి సుప్రియ శ్రీనాథే కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని