ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాల సారథి, సంస్కార వారధి

ప్రధానాంశాలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాల సారథి, సంస్కార వారధి

ప్రథమ వర్ధంతి సభలో వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ, తాడేపల్లి, న్యూస్‌టుడే: ‘పిల్లల్లో సంస్కార బీజాలు నాటేందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రయత్నించారు. సంస్కారం నేర్పని విద్య పండితుల్ని తయారు చేస్తుందేమో కానీ బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చదు. పిల్లలకు పురాణాలు, చరిత్రలోని మహనీయుల వ్యక్తిత్వాలు, మన పాటలు, పద్యాలను నేర్పించి సంస్కారాన్ని వంటబట్టించాలి’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి నేపథ్యంలో గురువారం 42 దేశాలు, వివిధ రాష్ట్రాల్లోని 110 తెలుగు సంఘాలు,  కనకమేడల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘విశ్వగానగంధర్వ- 2021’ అంతర్జాతీయ సంగీత సమ్మేళనాన్ని ఉద్దేశించి వెంకయ్యనాయుడు ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. ‘బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీసంగీత చరిత్రలో ఓ మైలురాయి. ఎంతోమంది జీవితాల్లో ఆయన గానం ఒక భాగమైంది. భాష, సంస్కృతుల పట్ల ఉన్న అభిమానం మా ఇద్దరినీ ఎంతో దగ్గర చేసింది. కథానాయకుల గాత్రంలోకి పరకాయప్రవేశం చేసి పాడే ఆయన ప్రతిభ అపురూపం. గాత్రదాతగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞ గల బాలు.. భూత, వర్తమాన, భవిష్యత్‌ తరాలకు స్వరాల సారథి, సంస్కార వారధి’ అని కీర్తించారు. పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎన్నో నూతన గళాలను పరిచయం చేసి, వారి ప్రతిభకు సానపెట్టారు. వేల స్వరాలను వెలుగులోకి తెచ్చారని గుర్తుచేశారు.

పెద్దల పట్ల ఆయన పాటించే వినమ్రత నేటి తరానికి ఆదర్శం కావాలన్నారు. బాలసుబ్రహ్మణ్యంపై రామజోగయ్యశాస్త్రి రాసి, కైలాశ్‌ఖేర్‌ ఆలపించిన గీతాన్ని వెంకయ్యనాయుడు విడుదల చేశారు. సినీ ప్రముఖులు సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ల భరణితోపాటు బాలు అభిమానులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని