వాయు కాలుష్యం లెక్క...ఇక పక్కా

ప్రధానాంశాలు

వాయు కాలుష్యం లెక్క...ఇక పక్కా

కొత్తగా రియల్‌టైం మానిటరింగ్‌ స్టేషన్లు

ఐఐటీ కంది సహా ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు!

వాయు కాలుష్యాన్ని నిరంతరం నమోదు చేసే రియల్‌టైం ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ (ఆన్‌లైన్‌) స్టేషన్లు ఎనిమిదింటికి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో దానికి రూ.కోటి చొప్పున ఖర్చు చేస్తున్న ఈ స్టేషన్ల ఏర్పాటు పనులు వచ్చే నెల మొదటివారంలో మొదలవుతాయని, అనంతరం నెల రోజుల్లో ఇవి వినియోగంలోకి వస్తాయని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. నగరంలో ఇప్పటికే ఉన్న ఆరు ఆన్‌లైన్‌ స్టేషన్లకు ఇవి అదనం.


ఐఐటీ సహకారంతో...

జాతీయ స్వచ్ఛ వాయు పథకం (నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం)లో భాగంగా కొత్త మానిటరింగ్‌ స్టేషన్లను పీసీబీ ఏర్పాటు చేస్తోంది. దీనికి ఐఐటీ హైదరాబాద్‌ (కంది) సహకారం కూడా తీసుకోనుంది. ఒక స్టేషన్‌ను ఐఐటీ వద్ద ఏర్పాటు చేయనుంది. ‘అన్ని స్టేషన్లు అందించే సమాచారాన్ని ఐఐటీ హైదరాబాద్‌ అధ్యయనం చేసి సలహాలిస్తుంది’ అని పీసీబీ అధికారులు తెలిపారు.


కొత్తవి ఎక్కడెక్కడ?

* ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం * మలక్‌పేట * నాచారం- మల్లాపూర్‌ * ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్స్‌, * కొంపల్లి * నార్సింగి * పటాన్‌చెరు * ఐఐటీ హైదరాబాద్‌


ప్రయోజనాలు ఇవీ...

ఆయా ప్రాంతాల్లో వాయు కాలుష్యం 24 గంటలూ నమోదవుతుంది. ఈ సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండేవారు, అటువైపు రాకపోకలు సాగించేవారు జాగ్రత్తపడొచ్చు. పీసీబీ సహా సంబంధిత శాఖలు కాలుష్యం కట్టడికి చర్యలు తీసుకునేందుకు ఈ సమాచారం దోహదపడుతుంది.


చాలీచాలని కేంద్రాలు

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు నగరాల్లో వాయుకాలుష్యం నిర్దేశిత పరిమితి కంటే అధికంగా ఉందని అంచనా. ఒక్క 2020లోనే హైదరాబాద్‌లో వాయుకాలుష్య ప్రభావంతో 11 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు గ్రీన్‌ పీస్‌ ఆగ్నేయాసియా సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెంట్రల్‌ యూనివర్సిటీ, సనత్‌నగర్‌, బొల్లారం, జూపార్కు, ఇక్రిశాట్‌, ఐడీఏ పాశమైలారం... ఇలా ఆరు ఆన్‌లైన్‌ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. మిగిలినచోట్ల మాన్యువల్‌గా లెక్కిస్తున్నారు. మాన్యువల్‌ లెక్కలపై అనుమానాలున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో సరైన సమాచారం లభిస్తుందని చెబుతున్నారు.


మిగతా నగరాల మాటేమిటి?

కొత్తగా 8 మానిటరింగ్‌ (ఆన్‌లైన్‌) స్టేషన్లు వస్తున్నప్పటికీ ఇవి సరిపోవు. వాయుకాలుష్యం అధికంగా ఉండే వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, రామగుండం వంటి చోట్లా ఇలాంటి స్టేషన్లు అవసరం. సూర్యాపేట, కామారెడ్డి, ఖమ్మం, మిర్యాలగూడ, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో వాయుకాలుష్యం నమోదు వ్యవస్థే లేదు. ఇక్కడ మాన్యువల్‌ స్టేషన్లయినా ఏర్పాటు చేయాలి. ఒక్కో మాన్యువల్‌ స్టేషన్‌ మాత్రమే ఉన్న నల్గొండ, కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండం, వరంగల్‌లో అదనంగా ఒకట్రెండు స్టేషన్లను అందుబాటులోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు.


- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని