కాల్వలు, తూముల నిర్వహణ బోర్డులతో సాధ్యమేనా?

ప్రధానాంశాలు

కాల్వలు, తూముల నిర్వహణ బోర్డులతో సాధ్యమేనా?

తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ప్రకాశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డులతో కాల్వలు, తూముల నిర్వహణ ఎంత వరకు సాధ్యమని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌రావు ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో నీటిపారుదల శాఖ ఇంజినీరు గుర్రం కోటిరెడ్డి మూడో స్మారకోపన్యాస సభలో ఆయన మాట్లాడారు. కాల్వల నిర్వహణ కూడా బోర్డుల పరిధిలోకి చేర్చడం వల్ల చాలా నష్టాలు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్‌, ఇంజినీర్లు రేయింబవళ్లు శ్రమించి కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టులను పూర్తి చేశారని, తెలంగాణ నీళ్ల స్వప్నం నెరవేరుతున్న వేళ ప్రస్తుత పరిస్థితులు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అడవులకు కంచె, పరిమితులు ఏర్పాటు చేసి వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడుతున్నారని, నదులు, నీటి వనరులకు సరిహద్దులు ఎందుకు గుర్తించి వాటి రక్షణ చేపట్టడం లేదో అంతా ఆలోచించాలని సూచించారు. ‘చెక్‌ డ్యాంల నిర్మాణాలు- చెరువులకు నీటి మళ్లింపు కోసం కాల్వలపై తూములు’ అనే అంశంపై విశ్రాంత ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ జె.విజయ్‌ ప్రకాశ్‌ ప్రసంగించారు. మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్యాంల నిర్మాణం సాగుతోందని, కొన్ని చోట్ల ప్రభుత్వం ఆశించిన తీరులో పనులు జరగడం లేదన్నారు. విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గుర్రం కోటిరెడ్డి ఉత్తమ ఇంజినీరని, తెలంగాణ ఉద్యమంలోనే కాక ఉత్తరాంధ్రలోని వంశధార ప్రాజెక్టు సర్వేలో కీలకంగా పనిచేశారంటూ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో విశ్రాంత సీఈ బి.అనంతరాములుకు స్మారక బహుమతిని అందజేశారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఛైర్మన్‌ రమణ నాయక్‌, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని