గంటన్నరపాటు స్తంభించిన తితిదే వెబ్‌సైట్‌!

ప్రధానాంశాలు

గంటన్నరపాటు స్తంభించిన తితిదే వెబ్‌సైట్‌!

జియో మార్టు పేరుతో రావడంపై ఆందోళన

రెండు గంటల్లోనే 2.39 లక్షల టికెట్ల నమోదు

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుమల: తితిదే ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో తితిదే వెబ్సైట్‌ను టీసీఎస్‌ నిర్వహిస్తూ ఉండేది. ఆ తర్వాత తితిదే వద్ద ఉన్న సర్వర్‌ సామర్థ్యం తక్కువగా ఉందని ప్రభుత్వ డొమెయిన్‌కు మారిపోయారు. తాజాగా శుక్రవారం టికెట్ల విడుదల సమయంలో గందరగోళం నెలకొంది. జియోమార్ట్‌ పేరుతో రావడంపై భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తితిదే అధికారులు తొమ్మిది గంటలకు టికెట్లను విడుదల చేయగా గంటన్నరపాటు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 10.30 తర్వాత సమస్యలు కొలిక్కి రావడంతో గంటన్నర వ్యవధిలోనే ఏకంగా 2.39 లక్షల టికెట్లు నమోదయ్యాయి.

సాంకేతిక సమస్యలిలా..

మొదట tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లిన వెంటనే tirupatibalaji.jiomart.com అని వచ్చింది. చరవాణి నంబరు ఇస్తే ఓటీపీ వస్తుందని అందులో కనిపించింది. చాలా మంది ప్రయత్నించినా గంటన్నరసేపు వెబ్‌సైట్‌ పనిచేయలేదు. మరికొందరికి నగదు చెల్లింపుల వద్ద నిలిచిపోగా, నగదు చెల్లించినట్లు ఇంకొందరికి కనిపించినా టికెట్లు మాత్రం రాలేదని చెబుతున్నారు. ఇలా తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మరోవైపు జియోమార్టు పేరు ఎందుకు వచ్చిందనే అంశంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఎవరైనా తితిదే వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత తితిదే అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు.  జియోసంస్థ దాదాపు రూ.3కోట్ల విలువైన సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిందని, దీన్ని రాజకీయం చేయడం బాధాకరమని  తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొన్ని ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని