బంజరు భూముల్లో బంగరు పంట

ప్రధానాంశాలు

బంజరు భూముల్లో బంగరు పంట

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుచేసి అద్భుత ఫలితాలు సాధిస్తున్న రైతు శ్రీనివాస్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌ - హైదరాబాద్‌: ఎందుకూ పనికిరాని బంజరు భూముల్లో ‘బంగారం’ పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ రైతు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వనపల్లి శ్రీనివాస్‌రెడ్డి సొంత పెట్టుబడితో డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. ఆయన మాజీ క్రికెట్‌ క్రీడాకారుడు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి మరీ ఈ పంట సాగు వైపు మళ్లారు. శుక్రవారం గుజరాత్‌కు చెందిన ఆరోచ్‌ ఆగ్రో ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీ వ్యవస్థాపకులు విశాల్‌ మహేంద్ర గడా నేతృత్వంలో ఓ బృందం ఈ తోటలను సందర్శించింది. ఒక చోట 3 ఎకరాల్లో, మరోచోట ఎత్తైన గుట్టల నడుమ 10 ఎకరాల విస్తీర్ణంలో వేసిన ‘డ్రాగన్‌ పంట’ను చూసి బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరో నాలుగైదు నెలల్లో ఈ క్షేత్రంలో పంట చేతికి రానుంది. ఎకరం విస్తీర్ణంలో ఈ పంట వేసుకోవాలంటే రూ.5 లక్షల పెట్టుబడి అవుతుందని.. నాలుగో ఏట నుంచి ఏటా రూ.6 లక్షల నికర ఆదాయం లభిస్తుందని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం తట్టుకోగల ఈ పంట తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో సాగుకు అత్యంత అనువైందన్నారు. విశాల్‌ మాట్లాడుతూ.. శ్రీనివాస్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో తాము కలిసి పనిచేసి డ్రాగన్‌ ఫ్రూట్‌  సాగుకు గొప్పు గుర్తింపు తీసుకురావాలన్నది లక్ష్యమన్నారు.

ప్రధాని మోదీ ప్రశంస

ఆస్ట్రేలియాలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగం వదిలేసి విశాల్‌ 2014-15లో గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట సాగుకు ఉపక్రమించారు. ఇతర రైతులను పోత్సహించి సాగను 1000 ఎకరాలకు పెంచారు. విశాల్‌, మిత్రబృందం సాధించిన విజయాలను ప్రధాని మోదీ జులైలో జరిగిన మన్‌కీ బాత్‌ ప్రసంగంలో ప్రశంసించారు.


ఇది శుభపరిణామం 

విశాల్‌ నా గురించి తెలుసుకుని గుజరాత్‌ నుంచి తెలంగాణకు రావడం శుభపరిణామం. 2005లో మన దగ్గర డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును పరిచయం చేసింది నేనే. ఎన్నో వ్యయ ప్రయాసలు, సవాళ్లు అధిగమించి 2015 నుంచి మంచి కాపు వచ్చి పండు చేతికి అందుతూ అద్భుత ఫలితాలు వస్తున్నాయి. దీనికి అదనపు విలువ జోడించి ఉప ఉత్పత్తులు ఎలా తయారు చేయవచ్చు అన్న దానిపై మేం ప్రత్యేక దృష్టి సారించాం.

 - శ్రీనివాస్‌రెడ్డి, ఆరుట్ల, రంగారెడ్డి జిల్లా


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని