దివంగత మాజీ శాసనసభ్యులకు అసెంబ్లీ సంతాపం

ప్రధానాంశాలు

దివంగత మాజీ శాసనసభ్యులకు అసెంబ్లీ సంతాపం

శాసనసభ, మండలి సోమవారానికి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశం తొలి రోజున దివంగత మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి (భద్రాచలం), అజ్మీరా చందూలాల్‌ (ములుగు), కేతిరి సాయిరెడ్డి (హుజూరాబాద్‌), కుంజా భిక్షం (బూర్గంపహాడ్‌), మేనేని సత్యనారాయణరావు(కరీంనగర్‌), మాచర్ల జగన్నాథం (వర్ధన్నపేట), రాజయ్యగారి ముత్యంరెడ్డి (రామాయంపేట), బొగ్గారపు సీతారామయ్య (సుజాతానగర్‌), చేకూరి కాశయ్య (కొత్తగూడెం) సేవలను స్పీకర్‌ కొనియాడారు. వారి ఆత్మశాంతి కోసం సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. ఈ సమావేశాలకు ప్యానల్‌ స్పీకర్లుగా డి.రెడ్యానాయక్‌, మహ్మద్‌ మోజంఖాన్‌, హనుమంత్‌షిండే, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వ్యవహరిస్తారని ప్రకటించారు. గృహ నిర్మాణ సంస్థ,  కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ ఉద్యానవన విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లులతోపాటు రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి కార్పొరేషన్‌, విద్యుత్తు శాఖ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలకు చెందిన వార్షిక నివేదిక, గణాంకాలను సభలో ప్రవేశపెట్టినట్లు స్పీకర్‌ ప్రకటించారు.

మండలిలో...

శాసనమండలి సమావేశాలు కూడా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం ఛైర్మన్‌గా నియమితులైన భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో తొలిసారిగా సమావేశాలు జరుగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వాణీదేవి, మరోసారి ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆయన సభకు పరిచయం చేశారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్సీలు పి.లింబారెడ్డి, టి.లక్ష్మారెడ్డి, హెచ్‌ఏ రెహ్మాన్‌, రాజయ్యకు మండలి సంతాపం తెలిపింది. ఈ సమావేశాలకు ప్యానల్‌ వైస్‌ ఛైర్మన్లుగా నారదాసు లక్ష్మణ్‌రావు, హసన్‌ జాఫ్రీ వ్యవహరిస్తారని ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి తెలిపారు. ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.


బీఏసీపై సభాపతిదే తుది నిర్ణయం: వేముల

అసెంబ్లీలో విపక్షాల సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎక్కువ అవకాశాలను ఇస్తున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. భాజపాను బీఏసీ సమావేశానికి పిలవాలా వద్దా అనే దానిపై శాసనసభాపతిదే తుది నిర్ణయమన్నారు. శుక్రవారం శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని అన్నారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ కంటే 15 శాతం ఎక్కువ ఓట్లు తమ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కి వస్తాయన్నారు. ఓటమి ఖాయమని తెలుసుకొని ఈటల ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.


నా పాట అమరవీరులకు అంకితం: రసమయి

తన పాట తెలంగాణ అమరవీరులకు, త్యాగాల పునాదులకు అంకితమని శాసనసభ్యుడు, సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రస్తుత భాజపా, కాంగ్రెస్‌లపై తాను పాటలు పాడే స్థాయిలో లేవని అన్నారు. శుక్రవారం శాసనసభ వాయిదా అనంతరం బయటికి వస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రసమయిలు తారసపడ్డారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ, ‘రసమయి గొంతు మూగబోయిందని’ చమత్కరించారు. దీనిపై రసమయి బదులిస్తూ... అవసరాన్నిబట్టి అది బయటకు వస్తుందని అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని