శాంతిదూతకు శాశ్వత సభ్యత్వం

ప్రధానాంశాలు

శాంతిదూతకు శాశ్వత సభ్యత్వం

భారత్‌కు ఇవ్వాల్సిందేనన్న అమెరికా

ఐరాస భద్రత మండలిని విస్తరించాలన్న డిమాండ్‌కు అగ్రరాజ్యం మద్దతు

అణు సరఫరాదారుల బృందంలో ప్రవేశానికీ సానుకూలత

రక్షణ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని మోదీ, బైడెన్‌ నిర్ణయం

వాషింగ్టన్‌: ప్రపంచ శాంతికి విశేష కృషి చేస్తున్న భారత దేశానికి ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్‌ఎస్సీ)లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అభిప్రాయపడింది. భారత్‌తో పాటు మరికొన్ని ముఖ్యమైన దేశాలకూ దీనిలో చోటుకల్పించాల్సి ఉందని, ఇందుకోసం తీసుకొచ్చే సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. దీంతో పాటు అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ ప్రవేశానికీ ఆయన సుముఖత తెలిపారు. రక్షణ రంగంలో భారత్‌ను ప్రధాన భాగస్వామిగా గుర్తిస్తున్నామని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీతో శ్వేతసౌధంలో గంటన్నరకు పైగా కొనసాగిన ద్వైపాక్షిక సమావేశంలో పలు అంశాలపై అగ్రనేతలిద్దరూ చర్చించుకున్నారు. సంయుక్త ప్రకటన ద్వారా వాటి వివరాలను వెల్లడించారు.

అమెరికా చేసిన తాజా ప్రకటన ద్వారా ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో సంస్కరణలు తీసుకురావాలంటూ భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి మద్దతు లభించినట్లయ్యింది. ఐరాస భద్రత మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌ను భారత్‌ సహా పలు దేశాలు చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ మేరకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. సమావేశం అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటన ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ‘‘సంస్కరించిన ఐరాస భద్రతమండలిలో భారత్‌కు, మరికొన్ని ముఖ్యమైన దేశాలకు శాశ్వత సభ్యత్వ అంశానికి అమెరికా మద్దతిస్తుందని బైడెన్‌ పునరుద్ఘాటించారు’’ అని ప్రకటన పేర్కొంది. ఆగస్టు నెలలో ఐరాస భద్రత మండలి అధ్యక్ష హోదాలో ఉన్న భారత్‌.. అఫ్గానిస్థాన్‌ సంక్షోభ సమయంలో సమర్థంగా పనిచేసిందని బైడెన్‌ కొనియాడారు. ఈ నేపథ్యంలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని తాను భావిస్తున్నానని బైడెన్‌ ఉద్ఘాటించినట్లు విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు.

ఐరాస భద్రతమండలిలో ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌లు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. తీర్మానాలను తిరస్కరించే(వీటో చేసే) అధికారం ఈ దేశాలకు ఉంటుంది. మరో 10 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ప్రతి రెండేళ్లకోసారి భద్రత మండలికి ఎన్నికవుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో శాశ్వత, తాత్కాలిక దేశాల సంఖ్యను పెంచాలని భారత్‌, జర్మనీ, జపాన్‌, బ్రెజిల్‌(జీ4) దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనికోసం మద్దతును కూడగట్టే యత్నాలను కొనసాగిస్తున్నాయి. మోదీ, బైడెన్‌ల భేటీలో మరో కీలకాంశం.. 48 దేశాలు సభ్యత్వం కలిగిన అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు చోటు కల్పించడంపై అమెరికా సుముఖత తెలపడం విశేషం.

ప్రధాన రక్షణ భాగస్వామి భారతే

భారత్‌తో రక్షణ సంబంధాల బలోపేతానికి, సత్సంబంధాలకు కట్టుబడి ఉన్నామని బైడెన్‌ హామీ ఇచ్చినట్లు విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. భారత్‌ తమ ప్రధాన రక్షణ భాగస్వామని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారన్నారు. అత్యాధునిక సైనిక సాంకేతికతల్లో సహకారం, రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని మరింతగా పెంచడాన్ని నేతలు స్వాగతించినట్లు ఇరు దేశాల సంయుక్త ప్రకటన పేర్కొంది.

2016 నుంచి ఇరు దేశాల మధ్య నాలుగు కీలక రక్షణ ఒప్పందాలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతరిక్షం, సైబర్‌, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, 5జీ, 6జీ సాంకేతిక పరిజ్ఞానాలు, బ్లాక్‌చైన్‌, టెలికమ్యూనికేషన్‌ రంగంలో భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీ, ఆరోగ్యభద్రత తదితర రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని విస్తరింపజేసుకోవాలని నేతలు నిర్ణయించారు.

* ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాల రక్షణ కోసం క్వాడ్‌ దేశాల మధ్య సహకారం వృద్ధిచెందడంపై భారత్‌, అమెరికాలు స్వాగతించాయి.

* సీమాంతర ఉగ్రవాదాన్ని మోదీ, బైడెన్‌ ఖండించారు. 26/11 ముంబయి దాడుల కుట్రదారులను శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. ఉగ్రవాద నిర్మూలనకు ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించారు.

* భారత్‌కు చెందిన వృత్తి నిపుణులు అమెరికా వచ్చేందుకు ఎదురవుతున్న సమస్యల్లో భాగంగా హెచ్‌1బీ వీసాల గురించి మోదీ ప్రస్తావించారు. ఆ తర్వాత ఓ వాస్తవ నివేదిక విడుదల చేసిన శ్వేతసౌధం 2021లో ఇప్పటివరకు 62 వేల వీసాలను భారతీయ విద్యార్థులకు జారీ చేసినట్లు తెలిపింది.

* ఇతర దేశాలపై దాడులకు దిగే ఉగ్ర మూకలకు ఆశ్రయం కల్పించే, శిక్షణ ఇచ్చే కేంద్రంగా అఫ్గానిస్థాన్‌ను మార్చవద్దని తాలిబన్లకు భారత్‌, అమెరికాలు స్పష్టం చేశాయి. అఫ్గాన్‌ ప్రజలు...ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, అల్పసంఖ్యాక ప్రజల హక్కులను గౌరవించాలని సూచించాయి.

* పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన ప్యారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా తిరిగి దానిని ఆమోదించడాన్ని భారత్‌ స్వాగతించింది. పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో భారత్‌ దేశం నిర్దేశించుకున్న 450 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు తమ వంతు సాయాన్ని చేస్తామని బైడెన్‌ తెలిపారు.


అఫ్గాన్‌ను ఉగ్రవాదుల అడ్డాగా మార్చకండి

ఇటు పాక్‌కు.. అటు చైనాకు ‘క్వాడ్‌’ పరోక్ష హెచ్చరిక

అఫ్గానిస్థాన్‌ గడ్డను ఉగ్రవాదుల ఆశ్రయ కేంద్రంగా మారిస్తే ఊరుకోమని చతుర్భుజ (క్వాడ్‌) కూటమి స్పష్టం చేసింది. అక్కడి నుంచి వేరే దేశంపై దాడికి ప్రణాళికలు రచించినా, సీమాంతర ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యలకు పాల్పడినా సహించబోమని పరోక్షంగా పాకిస్థాన్‌ను హెచ్చరించింది. అఫ్గాన్‌ నుంచి ముష్కరులను కశ్మీర్‌లోకి పంపి.. అలజడి సృష్టించాలని పాక్‌ పన్నాగాలు పన్నుతున్న నేపథ్యంలో క్వాడ్‌ కూటమి ఈ ప్రకటన చేయడం విశేషం. శుక్రవారం క్వాడ్‌ కూటమిలోని దేశాధినేతలు బైడెన్‌ (అమెరికా), మోదీ (భారత్‌), స్కాట్‌ మోరిసన్‌ (ఆస్ట్రేలియా), యోషిహిదే సుగా (జపాన్‌) శ్వేతసౌధంలో సమావేశమైన సంగతి తెలిసిందే. తర్వాత ఈ సంయుక్త ప్రకటన విడుదలైంది. ఇందులో ఇటు పాక్‌.. అటు చైనాను ఉద్దేశించి క్వాడ్‌ పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం.. స్వేచ్ఛాయుతంగా ఉండేందుకు అన్ని చర్యలను తీసుకుంటామని, ఇక్కడ అంతర్జాతీయ చట్టాలు అమలయ్యేలా చూస్తామని పేర్కొంది. ఈ ప్రాంతంలో బలమైన కూటమి అయిన ఆసియాన్‌ (ఇండోనేసియా, మలేసియా, పిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, బ్రునై, వియత్నాం, మలేసియా, లావోస్‌, మయన్మార్‌, కాంబోడియా)కు క్వాడ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

7.9 కోట్ల డోసులు అందించాం

పేద, మధ్యాదాయ దేశాలకు 120 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన క్వాడ్‌ కూటమి.. అందులో భాగంగా ఇండో పసిఫిక్‌ దేశాలకు 7.9 కోట్ల టీకాలను అందించినట్లు పేర్కొంది. హైదరాబాద్‌లోని బయోలాజికల్‌-ఇ లిమిటెడ్‌కు ఆర్థిక సాయం అందించి.. అక్కడ టీకాల తయారీ సామర్థ్యం పెంచామని సంయుక్త ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్యసమితి ‘కొవాక్స్‌’ కార్యక్రమానికి కూడా టీకాలు అందిస్తామని వెల్లడించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని