రూ.700 కోట్ల కార్వీ షేర్ల జప్తు

ప్రధానాంశాలు

రూ.700 కోట్ల కార్వీ షేర్ల జప్తు

 బీమా వ్యాపారంలోకి ఖాతాదారుల  సొమ్ము మళ్లింపు

వినియోగదారుల షేర్ల అక్రమ తనఖాతో కేఎస్‌బీఎల్‌ ఘనకార్యం

 ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌(కేఎస్‌బీఎల్‌) మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. సంస్థ సీఎండీ కొమండూరు పార్థసారథితో పాటు అతని కుమారులు రజత్‌ పార్థసారథి, అధిరాజ్‌ పార్థసారథి అధీనంలో నుంచి సుమారు రూ.700 కోట్ల షేర్లను శనివారం జప్తు చేసింది. మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు క్రమంలో ఈనెల 22న హైదరాబాద్‌లోని ఆరు ప్రాంతాలు సహా ఇతర నగరాల్లో చేపట్టిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఈ షేర్లను జప్తు చేసింది. ఈ సంస్థ నిర్వాహకులు తొలుత వినియోగదారుల షేర్లను పలు బ్యాంకుల్లో అక్రమంగా తనఖా పెట్టి రుణాలు పొందిన వ్యవహారంలో సెబీకి ఫిర్యాదులు అందడంతో అక్రమాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తమను రూ.329 కోట్ల మేర మోసం చేసిందని హెచ్‌డీఎఫ్‌సీ, రూ.137 కోట్ల నష్టం కలిగించిందని ఇండస్‌ఇండ్‌ బ్యాంకులు హైదరాబాద్‌ సీసీఎస్‌కు, రూ.562.5 కోట్ల మేర మోసగించిందని ఐసీఐసీఐ బ్యాంకు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న పార్థసారథిని కోర్టు అనుమతితో విచారించిన అనంతరం అతడి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి రూ.700 కోట్ల షేర్లను స్వాధీనం చేసుకుంది. మరోవైపు సెబీ, ఎన్‌ఎస్‌ఈ కూడా కార్వీ అక్రమాలపై విచారణ జరుపుతున్నాయి.

షేర్ల తనఖాతో రూ.2873 కోట్ల రుణం

స్టాక్‌ బ్రోకింగ్‌ లావాదేవీల పేరిట వినియోగదారుల షేర్లపై అదుపు సంపాదించిన కార్వీ సంస్థ.. వినియోగదారులకు తెలియకుండానే వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి అక్రమంగా రుణాలు పొందింది. ఈ వ్యవహారంపై ఓ వినియోగదారుడి ఫిర్యాదు మేరకు సెబీ విచారణ జరపగా రూ.2873 కోట్ల మేర రుణాలు పొందినట్లు తేలింది. ఈక్రమంలో ఈడీ దర్యాప్తు ఆరంభించడంతో కీలక విషయాలు వెలుగుచూశాయి. 2019 జనవరి నుంచి ఆగస్టు వరకు కేఎస్‌బీఎల్‌ సంస్థ డిపాజిటరీ పార్టిసిపేటరీ(డీపీ) ఖాతా నం.11458979కు సంబంధించిన వివరాలను స్టాక్‌ ఎక్స్ఛేంజిలతో పంచుకోలేదని వెల్లడైంది. వినియోగదారులకు సంబంధించిన షేర్లను అక్రమపద్ధతిలో ఈ ఖాతాకు మళ్లించినట్లు తేలింది. వాటినే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందినట్లు గుర్తించారు. ఈ సొమ్మును ‘స్టాక్‌ బ్రోకర్‌-క్లయింట్‌ అకౌంట్‌’లో కాకుండా 6 ‘స్టాక్‌ బ్రోకర్‌-ఓన్‌ అకౌంట్‌’లకు మళ్లించినట్లు తేలింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం 2016 ఏప్రిల్‌1 నుంచి 2019 అక్టోబరు 19 వరకు రూ.1096 కోట్ల రుణాన్ని కార్వీ రియాలిటీ ఇండియా లిమిటెడ్‌(కేఆర్‌ఐఎల్‌)కు మళ్లించినట్లు వెల్లడైంది.

8 డొల్ల కంపెనీల పేరిట బీమా వ్యాపారం

అక్రమంగా రుణాలు పొంది మళ్లించిన సొమ్ముతో కార్వీ గ్రూపు సంస్థల ప్రతినిధులు బీమా వ్యాపారం నిర్వహించినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కార్వీ కన్సల్టెంట్స్‌ లిమిటెడ్‌(కేసీఎల్‌)తో పాటు మరో 8 డొల్ల కంపెనీలను ఇందుకు వినియోగించినట్లు గుర్తించారు. బీమా వ్యాపారంతో పాటు రూ.కోట్లలో స్థిరాస్తుల్ని సంపాదించినట్లు తేలింది. పార్థసారథి సూచనలతో ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని యాంటీ ఫోరెన్సిక్‌ టూల్స్‌ను వినియోగించి కంప్యూటర్ల నుంచి ఇటీవల తొలగించినట్లు గుర్తించారు. కార్వీ గ్రూపు సంస్థల నుంచి డొల్ల కంపెనీల ఖాతాలకు పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు నడిచినట్లు బ్యాంకు నివేదికల ఆధారంగా నిర్ధారణకు వచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని