కన్నెత్తి చూస్తే కాలిపోతారు

ప్రధానాంశాలు

కన్నెత్తి చూస్తే కాలిపోతారు

 కావాలంటే నా సినిమాలు ఆపండి..పరిశ్రమను కాదు

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు ఆపేసి లక్షల మంది పొట్ట గొడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ సినిమాను ఆపేసినా, అతనొచ్చిన చిత్ర పరిశ్రమని ఆపేసినా అందరూ భయపడిపోయి... తమ దగ్గరికొస్తారని వైకాపా నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త’ అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సంపదను బ్యాంకుల్లో చూపించి, అప్పులు తెచ్చుకోవాలనే సినిమా టికెట్లపై పెత్తనం చెలాయించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు సహా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ స్పందించి, జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘రిపబ్లిక్‌’ సినిమా ముందస్తు విడుదల వేడుకకు పవన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ఇలా సాగింది...

కనికరం చూపాలి

‘సాయితేజ్‌ ప్రమాదానికి గురైతే చాలామంది సానుభూతి తెలిపారు. ఇదే సమయంలో మీడియాలో కొద్దిమంది నిర్లక్ష్యంగా వెళ్లాడని, ఎక్కువ వేగంతో వెళ్లాడని ప్రోగ్రామ్స్‌ చేశారు. అలా చేసే వ్యక్తులు కొంచెం కనికరం చూపించాలని కోరుతున్నా. ఇలాంటి కథనాల కంటే... వై.ఎస్‌.వివేకానందరెడ్డి ఎందుకు హత్యకి గురయ్యారో మాట్లాడితే బాగుంటుంది. కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ విమానాశ్రయంలో పొడిచారు. అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ కూడా భారీ కుట్ర ఉందని చెప్పారు. అది ఏమైందని అడగండి. ఇడుపులపాయ నేలమాళిగలో టన్నులకొద్దీ డబ్బులు ఉంటాయని చెబుతుంటారు. దానిపై కథలు నడపండి. లక్షలాది ఎకరాల్లో గిరిజనులు పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే అది వాళ్లకి దక్కడం లేదు. అదెందుకో దాని గురించి మాట్లాడండి. ఆరేళ్ల చిన్నారి హత్యకి గురైతే అది వదిలేసి తేజ్‌ ప్రమాదం గురించి మాట్లాడితే ఎలా? తెదేపా అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైకాపా వచ్చాక దాని గురించి ఎందుకు మాట్లాడరో అడగాలి’ అని పవన్‌ అన్నారు.

చిత్రపరిశ్రమ గురించి మాట్లాడితే బాధేస్తుంది

‘చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే నాకు బాధేస్తుంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కోట్లు తీసుకున్నారంటున్నారు. అది ఎవరినీ దోచింది కాదు, వాళ్ల కష్టంతో సంపాదించింది.  పైగా ప్రభుత్వానికి 45శాతం పన్ను కడుతున్నారు. మారుమూల ప్రాంతానికి చెందిన కళాకారుడు మొగిలయ్యని ఎవరూ పట్టించుకోకపోతే... మేం గుర్తించి డబ్బు ఇచ్చాం. మీరు ఒక్కసారి ఎన్నికల్లో గెలిచి 30 ఏళ్లు ఉండాలనుకుంటారు. వ్యాపారాల్లో ఉన్నవాళ్లకి అలా ఉండదా? వాళ్లు థియేటర్లు కట్టుకుంటే తప్పా?’ అన్నారు.

‘వకీల్‌సాబ్‌’ దిల్‌రాజు నాతో ఎందుకు చేశారు? నాతో ఆ సినిమా తీయకపోతే ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు విడుదలై ఉండేవి. ఇప్పటికైనా కావాలంటే నా సినిమాలను ఆపేయండి. మిగతా వారి సినిమాలను వదిలేయండి. చిత్ర పరిశ్రమ ప్రభావం చాలా పెద్దది. దీనివైపు కన్నెత్తి చూడకండి. కాలిపోతారు. అధికారంలో ఉన్న వాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే గడాఫీకిపట్టిన గతే పడుతుంది. విచక్షణారహితంగా అధికారాన్ని వాడేస్తే ఎటు దారితీస్తుందో తెలియదు’ అని పవన్‌ అన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని