అనుక్షణం అత్యంత అప్రమత్తం

ప్రధానాంశాలు

అనుక్షణం అత్యంత అప్రమత్తం

ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: భారీవర్షాలు, వరదలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణ, ఆస్తినష్టాలను నివారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. పోలీస్‌, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. అవసరమైతే హైదరాబాద్‌, కొత్తగూడెం, వరంగల్‌లలోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. దిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి సోమవారం ఉదయం సీఎస్‌తో సమావేశమయ్యారు. భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులను సమీక్షించారు. గులాబ్‌ తూపాన్‌ ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సచివాలయంలోని కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించాలన్నారు.

అధికారుల పర్యవేక్షణ..
సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సోమవారం మధ్యాహ్నం డీజీపీ మహేందర్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు, బ్రిడ్జీల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్లతో సమన్వయంతో పని చేయాలని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలీస్‌ అధికారులతో కూడా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు డీజీపీ పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని