ధాన్యం అంతా సేకరించండి

ప్రధానాంశాలు

ధాన్యం అంతా సేకరించండి

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో ఏకాంతంగా భేటీ

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో యాసంగి, వర్షాకాలాల్లో పండే ధాన్యాన్ని సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం కేసీఆర్‌ ఆయనను కలిశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని వివరించారు. ధాన్యంతో పాటు ఉప్పుడు బియ్యాన్ని సేకరించాలని కోరారు. కరోనా సమయంలో ధాన్యం, ఇతర పంటలను తామే కొనుగోలు చేశామని వివరించారు. దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణ అంశంపై మంత్రుల బృందం అధ్యయనం చేస్తోందని, మూడు నాలుగు రోజుల్లో సమాచారం ఇస్తామని పీయూష్‌ గోయల్‌ తెలిపినట్లు సమాచారం. అనంతరం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోం శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. హోంమంత్రి అమిత్‌ షాతో ఏకాంతంగా భేటీ అయ్యారు. సుమారు 1.50 గంటల పాటు వారి మధ్య భేటీ కొనసాగింది. ఏయే అంశాలపై చర్చించారనే విషయం తెలియరాలేదు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి కూడా అమిత్‌ షాను ఆయన నివాసంలో కలిసి గంటన్నర పాటు భేటీ అయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంలోనూ, భాజపాలోనూ కీలక శక్తిగా ఉన్న షాతో వరుసగా రెండు రోజులపాటు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రమంత్రి గోయల్‌ను కలిసిన సమయంలో ముఖ్యమంత్రి తనతో పాటు తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి, పెద్దపల్లి, జహీరాబాద్‌ ఎంపీలు డాక్టర్‌ వెంకటేష్‌ నేత, బి.బి.పాటిల్‌, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వరెడ్డి, రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తదితరులను తీసుకెళ్లారు. అమిత్‌ షాను కలిసేందుకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి వెంట డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ ఉన్నారు. వారు ఉన్నప్పటికీ సీఎం, హోం మంత్రిని ఏకాంతంగా కలవడంతో ఈ భేటీలు రాజకీయపరమైనవేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నేడు హైదరాబాద్‌కు పయనం..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారీవర్షాల వల్ల వాతావరణం అనుకూలంగా లేక ప్రయాణాన్ని మంగళవారానికి వాయిదా వేసుకున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆయన హైదరాబాద్‌ బయలుదేరుతారు.


ఒకరిపై ఒకరు నిందలొద్దు: వినోద్‌ కుమార్‌

దేశవ్యాప్తంగా ధాన్యం ఉత్పత్తి పెరిగినందున పంటల వైవిధ్యం అవసరం ఉందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అభిప్రాయపడ్డారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ చెప్పారు. ముఖ్యమంత్రితో కలిసి కేంద్రమంత్రితో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

గోధుమ సాగయ్యే పంజాబ్‌లోనూ వరి పండిస్తుండడంతో ధాన్యం ఉత్పత్తి విపరీతంగా పెరిగిందన్నారు. రాష్ట్రం నుంచి ఎంత మొత్తం సేకరించేదీ రెండు మూడు రోజుల్లో తెలియజేస్తామన్నారని చెప్పారు. సీఎం రెండుసార్లు కలిసినా స్పష్టత ఇవ్వకపోవడమేమిటని ప్రశ్నించగా ‘ఒకరిపై ఒకరు నిందలొద్దు. హరిత విప్లవం తర్వాత ధాన్యం, ఇతర పంటల ఉత్పత్తులు పెరగడంతో సమస్య వస్తోంది’ అని అన్నారు. ధాన్యం ఎంతమేర విదేశాలకు ఎగుమతి చేయాలనే అంశాన్ని కేంద్రమే చూడాలని ఆయన సూచించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని