చిన్న వ్యాపారులను ప్రోత్సహించాం

ప్రధానాంశాలు

చిన్న వ్యాపారులను ప్రోత్సహించాం

అమెజాన్‌ వెల్లడి

దిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ను ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ 2.0’గా పేర్కొంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ పత్రిక ‘పాంచజన్య’ కథనం ప్రచురించడం దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలు నిజమైనవేనని అఖిల భారత వర్తకుల సమాఖ్య పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, వాటిని విస్మరించడానికి వీల్లేదని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ క్రమంలో అమెజాన్‌ స్పందించింది. చిన్న వ్యాపారులు, కళాకారులు, సరఫరాదారులకు తాము తోడ్పాటు అందిస్తున్నామంటూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా మహమ్మారి ఉద్ధృతంగా విస్తరించిన సమయంలో కొత్తగా సుమారు 3 లక్షల మంది వ్యాపారులు మాతో జత కలిశారు. వీరిలో 75 వేల మంది స్థానిక దుకాణదారులే ఉన్నారు. వీరంతా భారత్‌లోని 450కు పైగా పట్టణాలకు చెందిన ఫర్నీచర్‌, స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్‌, సౌందర్య ఉత్పత్తులు, మొబైల్‌ ఫోన్లు, దుస్తులు, ఔషధ ఉత్పత్తులను విక్రయించేవారే. అమెజాన్‌ ఎక్స్‌పోర్ట్‌ కార్యక్రమం ద్వారా దేశంలోని మెట్రో, ఇతర నగరాలకు చెందిన 70 వేలకు పైగా మంది వ్యాపారులు... తమ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఉత్పత్తులను విదేశాల్లో విక్రయిస్తున్నారు. సుమారు 200 దేశాల్లో వారి ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి’’ అని పేర్కొంది. భారత్‌పై గుత్తాధిపత్యం కోసం 18వ శతాబ్దంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ చేసినట్టే, ఇప్పుడు అమెజాన్‌ కూడా వ్యవహరిస్తోందంటూ పాంచజన్య తాజా సంచికలో ముఖచిత్ర కథనం ప్రచురించింది. తమకు అనుకూలమైన ప్రభుత్వ విధానాల కోసం లంచాల రూపంలో కోట్లాది రూపాయలను వెదజల్లుతోందని విమర్శించింది.


గుత్తాధిపత్యం కోసమే... 

‘‘అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల వ్యాపార విధానాలు ఈస్ట్‌ ఇండియా కంపెనీ మాదిరే ఉన్నాయి. నాణ్యతను పట్టించుకోకుండా తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తున్నాయి. మార్కెట్‌లో పోటీని నాశనం చేయడం ద్వారా గుత్తాధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని అఖిల భారత వర్తకుల సమాఖ్య అధ్యక్షుడు బీసీ భారతీయ విమర్శించారు. 

ఇప్పటికే ఆ రెండు సంస్థలు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విచారణను ఎదుర్కొంటున్నాయి. ఈ విచారణను నిలుపుదల చేయాలన్న ఆ సంస్థల అభ్యర్థనను సుప్రీంకోర్టు కూడా గత నెలలో తిరస్కరించింది.


ఆరోపణలను విస్మరించడానికి వీల్లేదు: కాంగ్రెస్‌ 

అమెజాన్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, వాటిని విస్మరించడానికి వీల్లేదని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ‘‘భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు యుగళగీతం పాడుతున్నాయి. సాగుచట్టాల రద్దు కోరుతూ రైతులు 10 నెలలుగా ఆందోళన చేస్తున్నా... సంఘ్‌ పరివార్‌కు చెందిన భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఒక్కరోజూ అందులో పాల్గొనలేదు. పాంచజన్య తాజా కథనాన్ని జాతీయ ప్రయోజనాల కోసం కాకుండా, కాషాయ పార్టీ ప్రయోజనాలను కాంక్షించే ప్రచురించింది’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా విమర్శించారు.


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని