కష్టం తోడుగా.. కల నిజమాయెగా..

ప్రధానాంశాలు

కష్టం తోడుగా.. కల నిజమాయెగా..

కొలువు పట్టడానికి కావాల్సిన  నైపుణ్యాలను సానబెట్టే వేదిక దొరికితే.. యువత తలరాతలు మారిపోతాయి. నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ పల్లె.. పట్నం, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఏవీ ఆటంకం కాదని నిరూపిస్తున్నారు కొందరు యువతీ యువకులు.  వారు ఉద్యోగం సాధించిన వైనం ఇతరులకు స్ఫూర్తిమంతం..


మా ఊళ్లో మొదటి ఐటీ ఉద్యోగిని

కాటూరు శోభ, డేటా ఇంజినీర్‌

మాది నెల్లూరు జిల్లా కానూరు గ్రామం. పదోతరగతిలో నాకు మండలంలో మొదటి ర్యాంకు వచ్చింది. మా నాన్న వ్యవసాయం చేస్తారు. చిన్నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఆయనే నన్ను కళాశాలలో చేర్పించారు. ఇంజినీరింగ్‌లో ఈసీఈ తీసుకున్నాను. కళాశాలలో రూమ్‌ మేట్స్‌ సీఎస్‌ఈ కావడంతో కోడింగ్‌, టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరాను. నా దగ్గర ల్యాప్‌టాప్‌ కూడా లేదు. ఊళ్లో ఇంటర్నెట్‌ సరిగ్గా వచ్చేది కాదు. దీంతో తెల్లవారుజామున లేచి మేడపైకి వెళ్లి తరగతులకు హాజరయ్యేదాన్ని. మొబైల్‌ నుంచే కోడింగ్‌ నైపుణ్యాలను నేర్చుకున్నాను. జావా స్క్రిప్ట్‌ నేర్చుకోవడం మొబైల్‌లో కష్టమైనా ఎట్టకేలకు పూర్తిచేశాను. ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి జంకేదాన్ని. నెక్ట్స్‌వేవ్‌ మెంటర్ల తోడ్పాటుతో దీన్ని అధిగమించి ఉద్యోగం సాధించాను. లాస్‌ఏంజిల్స్‌ కేంద్రంగా పనిచేసే సిస్‌టెక్‌లో డాటా ఇంజినీర్‌ ట్రెయినీగా కొలువు వచ్చింది. మా ఊళ్లోనే నేను తొలి ఐటీ ఉద్యోగినని చెబుతుంటే గర్వంగా అనిపిస్తుంది.  


మూడేళ్ల తర్వాత కొలువు

 కిరణ్మయి కాసా, ఇంటెర్న్‌ అనలిస్టు

లక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో మంచి స్కోరుతోనే చదువు పూర్తి చేశా. ఫైనలియర్‌ వచ్చేవరకు కెరీర్‌ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇంజినీరింగ్‌ పూర్తికాగానే పెళ్లైంది. మూడేళ్లు ఇంట్లోనే ఉన్నాను. బాగా చదువుకుని ఖాళీగా ఉండటం ఎందుకు అనిపించింది. ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేయాలనే కల అయితే ఉండేది. అమ్మానాన్న, నా భర్త ప్రోత్సహించడంతో కొలువు కోసం అన్వేషణ మొదలైంది. అప్పుడే కంటిన్యూయస్‌ కెరీర్‌ బిల్డింగ్‌ ప్రోగ్రాం(సీసీబీపీ) 4.0 గురించి తెలియడంతో అందులో చేరాను. వ్యక్తిగత కారణాలతో మధ్యలో వదిలేశాను. తర్వాత ఎలాగైనా వదిలిపెట్టవద్దని పట్టుదలతో తరగతులు, లెక్చర్లు, సాధన, మాక్‌ ఇంటర్వ్యూలతో నైపుణ్యాలను పెంపొందించుకున్నాను. బహుళ జాతి కంపెనీలో ఉద్యోగం సాధించాను.  


ఈరోజు కోసం ఎదురుచూశా

భవ్య, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

నా చిన్నతనంలో అమ్మ చనిపోతే నాన్నే పెంచారు. 2015లో గ్రాడ్యుయేషన్‌ పూర్తికాగానే ఉద్యోగం వచ్చింది. ఊరికి దూరంగా సిటీకి పంపించడానికి నాన్న అంత సుముఖంగా లేరు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేయాలనేది నా కల. నిరాశ చెందినా పరిస్థితులను అర్థం చేసుకున్నాను. కానీ నమ్మకాన్ని కోల్పోకుండా రైల్వే, బ్యాంకు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవ్వడం మొదలెట్టాను. ఈ కొలువుల్లో చేరేందుకు అభ్యంతరం ఉండదని వీటిపై దృష్టి పెట్టాను. పరీక్షలు రాస్తున్న క్రమంలోనే నాకు పెళ్లైంది. ఒకరోజు నా కల గురించి భర్తతో మాట్లాడాను. అందుకు ఆయన ఒప్పుకొని ప్రోత్సహించారు. వెంటనే ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరి ఆర్నెల్ల పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై కృషి చేశాను. ఇటీవల నియోసాఫ్ట్‌ టెక్నాలజీస్‌లో నాకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది.


20 బ్యాక్‌లాగ్స్‌ను దాటి...

లీలాకృష్ణ, వెబ్‌ డెవలపర్‌

నాన్న ఆటో డ్రైవర్‌. నేను కళాశాలలో చదివేటప్పుడు అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. బంగారంపై రుణం తీసుకుని ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కాం. ఆర్థిక ఇబ్బందులు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసొచ్చింది. వీటన్నింటి మధ్య చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయాను. 20 సబ్జెక్టులు మిగిలిపోయాయి. చాలా నిరాశ పడినా.. తప్పు చేశానని అనిపించలేదు. అన్నింటి కంటే నాకు కుటుంబమే ముఖ్యం అన్పించింది. కొన్ని నెలల తర్వాత బ్యాక్‌లాగ్స్‌ పూర్తిచేస్తూ.. నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టిపెట్టాను. ఈ మధ్యనే నాకు వెబ్‌ డెవలపర్‌గా ఉద్యోగం వచ్చింది. సరైన సమయంలో దృష్టిపెడితే అనుకున్నది సాధించవచ్చు అనేందుకు నేను ఉదాహరణ.


నిరుద్యోగులకు నేర్పిస్తూ...

అత్తులూరి రాహుల్‌, సీఈవో, నెక్ట్స్‌వేవ్‌

దేశంలో 63 శాతం మంది గ్రాడ్యుయేట్లు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారు. ఉద్యోగం పొందినా 37 శాతం మంది తక్కువ వేతనాలు పొందుతున్నారు. చదువు పూర్తయినా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడటమే ఇందుకు కారణం. 30 శాతం మంది మాత్రమే తాము చదువుతున్న రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువు పూర్తయిన ఉద్యోగార్థులను పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నాం. ఇలా దేశంలో లక్షల మంది విద్యార్థులను పరిశ్రమకు సిద్ధంగా చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం.


ఏ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారంటే...  

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ 

ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ 

డేటా సైన్స్‌  

వర్చువల్‌/అగ్మెంటెడ్‌/మిక్సెడ్‌ రియాలిటీ 

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) 

సైబర్‌ సెక్యూరిటీ 

కృత్రిమ మేథ/మెషిన్‌ లెర్నింగ్‌ 


- ఈనాడు, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని