గత ఏడాది పంట నష్టాన్ని నాలుగు నెలల్లో చెల్లించండి

ప్రధానాంశాలు

గత ఏడాది పంట నష్టాన్ని నాలుగు నెలల్లో చెల్లించండి

విపత్తుల నిర్వహణ చట్టం కింద పరిహారం అందించాలి
బీమా లేని చిన్నకారు రైతులకూ తగిన సాయం చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన భారీవర్షాలకు జరిగిన పంట నష్టాన్ని నాలుగు నెలల్లో చెల్లించాలని కేంద్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ చట్టాల కింద కౌలురైతులు సహా అందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద సాయం చేయాలంది. పంట బీమా లేక ఆర్థికంగా చితికిపోయిన చిన్న, సన్నకారు రైతులకు తగిన సాయం అందించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. 2020 సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేలా, పంట నష్టాన్ని అంచనా వేసి చేయూతనిచ్చేలా ఆదేశించాలంటూ వి.కిరణ్‌కుమార్‌ సహా మరో ఇద్దరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి మంగళవారం తీర్పు వెలువరించింది. వర్షాలతో నష్టపోయిన ఒక్క రైతూ కోర్టును ఆశ్రయించనందున ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించాలన్న ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. వర్షాలకు రైతులు నష్టపోలేదని, అధికారుల సాయంతో పంటనష్టం నుంచి కోలుకున్నారన్న వాదనను తిరస్కరించింది. గత వర్షాల సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్రానికి పంట నష్టం వాటిల్లినట్లు లేఖలు రాశారని పేర్కొంది. 18 జిల్లాల్లో 2.04 లక్షల హెక్టార్లలో వరి, 3.10 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని, సాయం కింద రైతులకు రూ. 465 కోట్లు, ఇతర సహాయ కార్యక్రమాలకు రూ. 885 కోట్లు అవసరమంటూ రాసిన లేఖను కేంద్రం కోర్టుకు సమర్పించిందని పేర్కొంది. 5.97 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద రూ. 552.46 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కారు కేంద్రానికి తెలిపిందని గుర్తుచేసింది. రూ. 7,219 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద చెల్లించాల్సి ఉంటుందని చెప్పిందని పేర్కొంది.


విపత్తుల నిధులు ఉన్నాయి కదా..

‘‘ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తే 2019-20 దిగుబడి కంటే 2020-21 దిగుబడి తక్కువగా ఉందని తేలింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద గత ఏడాది ఏప్రిల్‌ నాటికి రూ. 977.67 కోట్లు ఉంది. దీనికి అదనంగా రూ. 449 కోట్లు కేంద్రం కేటాయించింది. రాష్ట్ర వాటా రూ. 149.67 కోట్లు ఉంటుంది. ఈ నిధుల్లో రూ.595.05 కోట్లు రాష్ట్రం ఖర్చు పెట్టుకోవచ్చు. వ్యవసాయం, హార్టికల్చర్‌కు తక్షణసాయంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ. 188.23 కోట్లు వినియోగించుకోవడానికి కేంద్రం ఆమోదించినా చెల్లింపులు జరగలేదు. ఆ ఏడాది కేంద్రానికి విపత్తుల నిర్వహణ చట్టం కింద నిధుల వినియోగానికి లెక్కలు పంపినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రభుత్వం సమర్పించిన లెక్కల ప్రకారం 33 శాతం పంట నష్టం జరిగినట్లు తేలినందున విపత్తుల నిర్వహణ చట్టం కింద ఆదుకోవాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద స్వచ్ఛందంగా రైతులే బీమా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంలో విఫలమైందన్న కోర్టు మూడు నెలల్లో పంట నష్టాన్ని అంచనా వేసి.. ఆపై నెలలోగా సాయం అందించాలని తీర్పు వెలువరించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని