కలుపు మందును తట్టుకునే కొత్త వరి

ప్రధానాంశాలు

కలుపు మందును తట్టుకునే కొత్త వరి

రెండు నూతన వంగడాలను రూపొందించిన ఐసీఏఆర్‌  
తొలిసారిగా భారతదేశంలో పరిశోధన

ఈనాడు, హైదరాబాద్‌: కలుపు తీయడానికి కూలీలు దొరక్క, కూలి రేట్లు భరించలేక అల్లాడుతున్న వరి రైతులకు శుభవార్త. కలుపు మొక్కలను చంపే రసాయనిక మందులను తట్టుకుని బతికే రెండు వరి బాస్మతి రకాలను ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్‌)కు చెందిన వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు. ప్రధాని మోదీ మంగళవారం విడుదల చేసిన పలు వంగడాల్లో ఈ రెండూ ఉన్నాయి. వరిలో ఇంతవరకూ జన్యుమార్పిడి(జీఎం) విత్తనాలు, కలుపును చంపే రసాయనాలను తట్టుకునే వంగడాలు భారతదేశంలో సాగుకు అనుమతి లేదు. ఐసీఏఆర్‌ పరిశోధనలు జరిపి ‘పూసా 1979, పూసా 1985’ అనే పేర్లతో రెండు వరి వంగడాలను విడుదల చేసింది.

ఎలా పండుతాయంటే...

వరి నాట్లు వేయకుండా వెదజల్లే పద్ధతిలో వీటిని సాగుచేయవచ్చు. ఈ విధానంలో పెరిగే కలుపును చంపడానికి రసాయన మందులను చల్లవచ్చు. వాటిని తట్టుకుని ఈ వంగడాల మొక్కలు బతుకుతాయి.

ఉత్తర భారతదేశంలో రైతులు సాగుచేస్తున్న ‘పూసా బాస్మతీ 1121, పూసా బాస్మతీ 1569’ రకాల వంగడాలను ‘రాబిన్‌ నాగిన్‌’ అనే వంగడంతో సంకరపరిచి జీనోమ్‌ బ్రీడింగ్‌ విధానంలో ‘పూసా 1979, పూసా 1985’ అనే రెండు వరి వంగడాలను తయారుచేశారు.


అధిక దిగుబడినిస్తాయి
-డాక్టర్‌ సోమసుందర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌

‘పూసా బాస్మతీ 1121, పూసా బాస్మతీ 1569, రాబిన్‌నాగిన్‌’ రకాలకున్న పాత లక్షణాలు గింజ సువాసన, సన్న బియ్యపు నాణ్యత, పొడతెగులును, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తితో పాటు అధిక దిగుబడినిచ్చే లక్షణాలు కొత్త వంగడాల్లోనూ ఉన్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పంజాబ్‌లో 15లక్షల ఎకరాల్లో కొత్త వంగడాలను రైతులు సాగుచేశారు. తెలుగు రాష్ట్రాల వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఇలాంటి కొత్త వంగడాలను సృష్టించాలి. వీటిని రైతులకు అందిస్తే సాగునీటి పొదుపుతో పాటు కలుపు నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని