ప్రాజెక్టుల అప్పగింతపై హైడ్రామా

ప్రధానాంశాలు

ప్రాజెక్టుల అప్పగింతపై హైడ్రామా

శ్రీశైలం కింద నాలుగు అవుట్‌లెట్లను ప్రకటించిన ఏపీ

సిబ్బంది, ఇతరత్రా బదిలీకి తెలంగాణ అప్పగిస్తేనే అని షరతు

జీవో విడుదల చేయని తెలంగాణ

విద్యుత్కేంద్రాలు తప్ప మిగతావి అప్పగింతపై పరిశీలన 

ఆరింటిని ప్రతిపాదిస్తూ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై హైడ్రామా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు కింద నాలుగు అవుట్‌లెట్లను(ప్రాజెక్టుల నుంచి నీరు బయటకు వెళ్లే మార్గాలను) బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణానదిపై మొత్తం 15 అవుట్‌లెట్లను కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకురావాలి. అందులో 9 తెలంగాణ అప్పగించాల్సినవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆరింటిని అప్పగించాలి. నాలుగింటికి సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండు విద్కుత్కేంద్రాలకు సంబంధించి ఏపీ జెన్‌కో తరఫున ఇంధనశాఖ ఆదేశాలు జారీ చేయనుంది. ఏపీ ఉత్తర్వులు జారీ చేస్తూ ఇందులో ఒక షరతు పెట్టింది. ‘‘కృష్ణా బోర్డు సమావేశంలో తీర్మానించిన ప్రకారం తెలంగాణ... అక్కడ ప్రాజెక్టులను, అవుట్‌లెట్లను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, ఆ ప్రక్రియ చేపడితేనే ఆంధ్రప్రదేశ్‌ అధికారులూ ముందుకెళ్లాలి. తెలంగాణతో పాటు ప్రక్రియ సమాంతరంగా సాగాలి. ఇందుకు సంబంధించి తెలంగాణ జలవనరులశాఖ, జెన్‌కోలతో ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ, ఏపీ జెన్‌ కో సమన్వయం చేసుకోవాలి’’ అని అధికారులను ఆదేశించింది. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (పాలన), కర్నూలు చీఫ్‌ ఇంజినీరు, అనంతపురం చీఫ్‌ ఇంజినీర్లకు ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉత్తర్వులు ఏమీ జారీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్‌ 14వ తేదీ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించిన తుది సమావేశాల్లో తీర్మానం చేసిన ప్రాజెక్టులను రాష్ట్రాలు అప్పగించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారికంగా ఉత్తర్వులు (జీవో) విడుదల కావాల్సి ఉన్నా  రెండు రాష్ట్రాలు ఆచితూచి అడుగులేస్తున్నాయి.

కేడబ్ల్యూడీటీ-2 వైపే తెలంగాణ చూపు

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి వరకు ఏ నిర్ణయం వెల్లడించలేదు. మొదటి నుంచీ జల విద్యుత్‌ కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడం లేదు. కృష్ణా జలాల్లో వాటా పెంపుతోపాటు, కొన్ని ప్రాజెక్టుల కింద నీటి కేటాయింపులు, తదితర అంశాలపై కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2 (కేడబ్ల్యూడీటీ-2) ద్వారా పరిష్కారానికి రాష్ట్రం ప్రయత్నిస్తోందని బోర్డు దృష్టికి కూడా తెచ్చింది. నదీ జలాల కోసం చేస్తున్న న్యాయపోరాటం ముగియకముందే మధ్యలోనే ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం సమంజసం కాదంటూ కొందరు నిపుణులు తాజాగా ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. మరోవైపు గెజిట్‌ వాయిదా వేస్తే మేలని, లేని పక్షంలో బోర్డు ప్రతిపాదించిన వాటిల్లో జల విద్యుత్‌ కేంద్రాలు మినహాయించి మిగిలినవి అప్పగించేందుకు పరిశీలన చేయొచ్చంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ సీఈ, నల్గొండ సీఈ పరిధిలోని అవుట్‌లెట్లను ఆయన లేఖలో ప్రస్తావించారు.

ఈఎన్‌సీ సూచించిన అవుట్‌లెట్లు, పోస్టుల (116) సమాచారం

* శ్రీశైలం పరిధిలో కల్వకుర్తి ఎత్తిపోతల పంపుహౌస్‌: 38 పోస్టులు 

* సాగర్‌ పరిధిలో ప్రాజెక్టు స్పిల్‌వే: 22 పోస్టులు

* కుడి కాల్వ హెడ్‌రెగ్యులేటర్‌: ---

* ఎడమ కాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌: 52 పోస్టులు 

* వరద కాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌: 2 పోస్టులు

* ఏఎమ్మార్పీ ఎత్తిపోతలు: 2 పోస్టులు

చర్చనీయాంశంగా ఉత్తర్వులు

తెలంగాణ అప్పగిస్తేనే ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొనడం, రెండు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఇంకా చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ చేపడుతున్న జల విద్యుత్‌ ఉత్పత్తితో ఏపీ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతోందని ఆ కేంద్రాలను బోర్డుల పరిధిలో తప్పకుండా చేర్చాలనేది ఏపీ మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. తెలంగాణ వాటిని బోర్డు పరిధిలోకి చేర్చకపోతే పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా అవుట్‌లెట్లను తాము ఇవ్వమని కూడా ఒక దశలో బోర్డుకు వివరించే ప్రయత్నం చేసింది. చివరికి సంఖ్యను తగ్గించినప్పటికీ ఆ రెండింటిని కూడా కలిపి ఉత్తర్వులు జారీ చేసింది. 

జూరాల ప్రాజెక్టునూ తీసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టును బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్‌ తన ఉత్తర్వుల్లో కోరింది. ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే వరద శ్రీశైలం ప్రాజెక్టుపై ప్రభావం చూపుతుందని తెలిపింది. అలాగే రెండు రాష్ట్రాల పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ అవి పూర్తయ్యాకనే బోర్డు తీసుకోవాలని సూచించింది. ఈ విషయాలను ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


కృష్ణా బోర్డుకు ఏపీ బదిలీ చేసిన అవుట్‌లెట్లు, పోస్టులు, ఇతర వివరాలు

* శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే- నది స్లూయీస్‌: సర్కిల్‌ కార్యాలయం పరిధిలో 39 పోస్టులు, నిర్వహణ డివిజన్‌, ఐదు ఉప డివిజన్ల కింద 142 పోస్టులు ఉన్నాయి.

* పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ (శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ): తెలుగు గంగ డిస్ట్రిబ్యూటరీ డివిజన్‌తోపాటు ఒక సబ్‌ డివిజన్‌, నాలుగు సెక్షన్లు కలిపి మొత్తం 37 పోస్టులు.

* హంద్రీనీవా ఎత్తిపోతల పంపుహౌస్‌: గడివేముల సబ్‌ డివిజన్‌, మల్యాల సెక్షన్లు ఉన్నాయి.

* ముచ్చుమర్రి ఎత్తిపోతల పంపుహౌస్‌: రెండు సెక్షన్లు ఉన్నాయి.

* హంద్రీనీవా, ముచ్చుమర్రి కలిపి 8 పోస్టులు ఉన్నాయి.

* ఉపసంఘం సభ్యులుగా ఉన్న అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీరు, ఏపీ జెన్‌ కో హైడల్‌ చీఫ్‌ ఇంజినీరు ప్రాజెక్టుల బదిలీ ప్రక్రియ సులువుగా జరిగేందుకు సహకరిస్తారని బోర్డు ఛైర్మన్‌కు తెలియజేశారు.


గోదావరి బోర్డు గెజిట్‌ అమల్లో ప్రతిష్టంభన

గోదావరి బోర్డు పరిధిలోకి పెద్దవాగు ప్రాజెక్టును చేర్చుతూ చేసిన తీర్మానాన్ని అమలు చేయడంలో ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేసి సిబ్బంది, ఆస్తులు, దస్త్రాలు ఇతరత్రా సమాచారాన్ని బోర్డుకు బదిలీ చేయాల్సి ఉంది. గురువారం నుంచి గెజిట్‌ అమల్లోకి వచ్చినప్పటికీ రెండు రాష్ట్రాలూ చర్యలేవీ చేపట్టలేదు.


ప్రాజెక్టుల నిర్వహణ ప్రొటోకాల్స్‌ అధ్యయనానికి కమిటీ

కేడబ్ల్యూడీటీ-2కు సమర్పించేందుకు నివేదిక కోరిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నిర్వహణలో ప్రొటోకాల్స్‌, నిల్వకు సంబంధించి అధ్యయనానికి ప్రభుత్వం ఇంజినీరింగ్‌ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ ఛైర్మన్‌గా, సీనియర్‌ న్యాయవాది వి.రవీందర్‌ రావు లీగల్‌ కన్సల్టెంట్‌గా నియమించిన కమిటీలో సీఈ మోహన్‌కుమార్‌, సీఈ శ్రీకాంత్‌రావ్‌, సాంకేతిక సలహా కమిటీలో సభ్యుడైన ఎంఏ రవూఫ్‌, ఇంజినీరింగ్‌ నిపుణుడు ఘన్‌శ్యాం ఝా, హైడ్రాలజీ సలహాదారు చేతన్‌ పండిట్‌లను సభ్యులుగా నియమించింది. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2కు సమర్పించేందుకు వీలుగా అన్ని కోణాల్లో సమగ్ర అధ్యయనం చేసి ఈ నెల 30 లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని