నలుగురిలో కాదు... నాలుగ్గోడల మధ్య మాట్లాడండి

ప్రధానాంశాలు

నలుగురిలో కాదు... నాలుగ్గోడల మధ్య మాట్లాడండి

ముక్కుసూటితనాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించాను
మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు
సీడబ్ల్యూసీ భేటీలో ‘జి-23 నేత’లకు సోనియా పరోక్ష చురకలు

ఈనాడు, దిల్లీ: నాయకత్వ మార్పు, ఇతర అంతర్గత వ్యవహారాల గురించి తరచూ మీడియాలో మాట్లాడుతున్న కపిల్‌ సిబల్‌, గులాంనబీ ఆజాద్‌ లాంటి జి-23 నేతలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చురకలంటించారు. శనివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ విషయాలను నాలుగు గోడల మధ్య మాట్లాడాలి తప్పితే నలుగురి మధ్య కాదని హితవు పలికారు. ‘‘ముక్కుసూటిగా మాట్లాడడాన్ని నేనెప్పుడూ ప్రోత్సహిస్తూ వచ్చాను. మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరం స్వేచ్ఛగా, నిజాయితీగా చర్చించుకుందాం. ఈ నాలుగు గోడల మధ్య తీసుకున్న నిర్ణయాలను బహిర్గతం చేసినప్పుడు అవన్నీ సీడబ్ల్యూసీ తీసుకున్న సామూహిక నిర్ణయాలే అవుతాయి’’ అని ఆమె స్పష్టంచేశారు.

ఆ స్పృహ నాకు ఉంది

‘‘నేను పూర్తికాల కాంగ్రెస్‌ అధ్యక్షురాలి తరహాలోనే పనిచేస్తున్నాను. 2019 నుంచి తాత్కాలిక అధ్యక్షురాలినేనన్న స్పృహ నాకుంది. ఈ జూన్‌ 30కే పూర్తిస్థాయి అధ్యక్ష ఎన్నిక పూర్తిచేయాలని అనుకున్నాం. కరోనా ఉద్ధృతి కారణంగా ఆ గడువును వర్కింగ్‌ కమిటీ నిరవధికంగా పొడిగించింది. ఆ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ పూర్తిస్థాయి సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను మీ ముందు పెడుతున్నాం. పార్టీ విధానాలు, కార్యక్రమాలను పార్టీ సహచరులు, ముఖ్యంగా యువ నేతలు ప్రజల వద్దకు బలంగా తీసుకెళ్తున్నారు. రైతు ఉద్యమాలు సహా వివిధ అంశాలపై వారు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మనం ఎప్పుడూ ప్రజా సమస్యలను విస్మరించలేదు’’ అని సోనియా చెప్పారు. ‘‘కాంగ్రెస్‌ని పునరుజ్జీవింపజేయాలని సమస్త పార్టీ యంత్రాంగం కోరుకుంటోంది. ఐక్యత, పార్టీ ప్రయోజనాలే దానిలో సర్వోత్కృష్టం కావాలి. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ అవసరం. పూర్తిస్థాయి సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను మీ ముందు పెడుతున్నాం’’ అని ఆమె చెప్పారు.

ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరం

దేశ ఆర్థిక వ్యవస్ధ ఆందోళనకరంగా తయారైందని.. కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టే బదులు ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తోందని సోనియా విమర్శించారు. పెట్రో ఉత్పత్తులు, వంటగ్యాస్‌/ వంటనూనె ధరల పెరుగుదలను తీవ్రంగా ఖండించారు. ప్రధాని మౌనం దేశాన్ని తీవ్రంగా నష్టపరుస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీలతో పాటు గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ సహా జీ-23 నేతలు హాజరయ్యారు. సంస్థాగత ఎన్నికలను ప్రకటించడంపై ఆజాద్‌, ఆనంద్‌శర్మ హర్షం వ్యక్తంచేశారు.

మనలో మనం కలహించుకోవడాన్ని ప్రజలు కోరుకోవడం లేదు: రాహుల్‌

ప్రజలు తమ హక్కుల కోసం కాంగ్రెస్‌ పోరాడాలని కోరుకుంటున్నారే గానీ నేతలు తమలో తాము కలహించుకోవడాన్ని కాదని రాహుల్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఎవరు ఏ పదవుల్ని నిర్వర్తిస్తున్నా కాంగ్రెస్‌ ఐక్యతపైనే ప్రజలకు ఆసక్తి ఉందని చెప్పారు. పార్టీని బలహీనపరచాలనుకుంటున్నవారు దీనిని కూడా గుర్తించాలన్నారు. అన్యాయం, అసమానత, విభజనవాదం, వివక్షలపై కాంగ్రెస్‌ పోరాడాలని, ప్రజలు అదే ఆశిస్తున్నారని చెప్పారు.


ఎన్నికైన నియంతృత్వం పాలిస్తోంది: సీడబ్ల్యూసీ 

ప్రజాస్వామ్యం బదులు ‘‘ఎన్నికైన నియంతృత్వం’’ మన దేశంలో నెలకొందని సీడబ్ల్యూసీ విమర్శించింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో తమతో చేతులు కలపాలని ప్రజాస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చింది.

* యూపీలోని లఖింపుర్‌ ఖేరిలో రైతులపై వ్యవహరించిన తీరు ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనమని, కర్షకుల జీవనోపాధిని దెబ్బతీసేందుకు గత ఏడేళ్లుగా కేంద్ర సర్కారు కుట్ర సాగిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఒక తీర్మానం ఆమోదించింది.

* వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో రైతులతో కలిసి పోరాడాలని నిర్ణయించింది. భూసేకరణ తీరు, పంటల బీమా, ఎరువులు- పురుగు మందులపై జీఎస్టీ వంటి అంశాలను ప్రస్తావించింది. అన్ని రకాలుగా భారం పెరిగి, ఆదాయం తగ్గిపోతున్న రైతులను ఆదుకోవాలంది.

* పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని, సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) పరిధి మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

* చైనా, పాకిస్థాన్‌లను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది.


 


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని