మనసు పలికే.. మనువుగీతం

ప్రధానాంశాలు

మనసు పలికే.. మనువుగీతం

సినిమాను తలపించేలా లఘుచిత్రాలు
తెలుగునాట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ మోజు
ఈనాడు, హైదరాబాద్‌, పాల్వంచ సాంస్కృతికం, న్యూస్‌టుడే

కాబోయే వధూవరులు..
కొత్త జీవితంపై ఎన్నో ఊసులు.
ఆ జ్ఞాపకాల దొంతరలను పదిల పరచుకోడానికి ఒకప్పుడు ఫొటోలు మాత్రమే ఉండేవి..

ర్వాతి కాలంలో పెళ్లి వీడియోలు వచ్చాయి. ఇప్పుడు పెళ్లికి ముందే సినిమాను తలదన్నేలా బ్రహ్మాండమైన సెట్టింగ్‌లతో వీడియో చిత్రీకరణ చేస్తున్నారు.. సినిమాల్లో కథానాయకుడు, కథానాయికలను మరిపించేలా ఔట్‌డోర్‌ లొకేషన్లలో ఆటపాటలతో.. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు జరుగుతున్నాయి. ఒకప్పుడు నగర/పట్టణ ప్రాంతాలకే పరిమితమైన.. ఈ సంస్కృతి.. ప్రస్తుతం పల్లెలకూ చేరుతోంది. ముఖ్యంగా పిల్లల సరదాల కోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్ధపడే పెద్దలు, ఎన్నారైలు ఎక్కువగా వీటిపై మోజు చూపిస్తున్నారు. పెళ్లిముహూర్తం ఖరారు కాగానే.. ఫొటోషూట్‌కు సన్నాహాలు చేసుకుంటున్నారు. హీరోహీరోయిన్లలా సరికొత్త వేషాలతో ముచ్చటైన దుస్తుల్లో నృత్యాలు చేస్తూ వీడియోలు దిగుతున్నారు. వారి అభిరుచికి తగినట్టు వీడియో/ఫొటోలను చిత్రీకరించి.. వారి ఊహాలకు దృశ్యరూపం ఇచ్చేందుకు ఎన్నో సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందుకోసం కొందరు ప్రత్యేకంగా స్టూడియోలు కూడా నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. ఇష్టమైన పాటలు.. మనసుకు నచ్చిన ప్రదేశాలను ఎంపిక చేసుకుని చిత్రీకరణకు సమయం కేటాయిస్తున్నారు. వారికి కుటుంబ పెద్దలూ మద్దతిస్తున్నారు. మంచుకురిసే వేళలో ముత్యపు చిప్ప నుంచి బయటకు రావటం.. చారిత్రక కోటలో చుట్టూ మందీమార్బలం మధ్య తేనీటిని ఆస్వాదించటం.. గుర్రాలు పూన్చిన పూలరథంపై సాగిపోవడం.. సీతాకోకచిలుక రెక్కలతో ఎగిరిపోవడం వంటివాటి ఎన్నో ఊహలను అద్భుత దృశ్యాలుగా మలచి లఘుచిత్రాలుగా చిత్రీకరిస్తున్నారు. 5-25 నిమిషాల చిత్రీకరణకు రోజుల పాటు సమయం వెచ్చించేందుకూ కొందరు మొగ్గు చూపుతున్నట్టు దినకర్‌ అనే వీడియోగ్రాఫర్‌ తెలిపారు.

సకుటుంబ సమేతంగా

కాబోయే ఆలుమగలు.. ఇరు కుటుంబాల సభ్యులు.. విహారంలా వెళ్తున్నారు. బడ్జెట్‌కు తగినట్టుగా సెట్టింగ్‌లు, ఫ్యాషన్‌ డిజైన్లు, సంప్రదాయ వస్త్రాలు, వంటివన్నీ ఒకేచోట సిద్ధంగా ఉంచుతారు. మేకప్‌, వేషధారణ, సందర్భానికి తగినట్టుగా హావభావాలు పలికించే ఫొటోగ్రాఫర్లు.. 5-10 మంది వరకూ ఆధునిక కెమెరాలు, 20-30 మంది వరకూ సహాయకులు. కొత్త వాతావరణాన్ని సృష్టించే కళాకారులు. సినిమాల్లో కనిపించే దృశ్యాల అనుభూతి మిగుల్చుతుందంటారు నగరానికి చెందిన ప్రత్యూష, విఘ్నేష్‌ జంట. రెండు నెలల కిందట తాము.. హుస్సేన్‌సాగర్‌, చౌమహల్లా ప్యాలెస్‌, హిమాయత్‌సాగర్‌ ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసి ఆస్వాదించామంటున్నారు.


కెమెరా.. క్లాప్‌.. యాక్షన్‌

ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్‌ కోసం.. శామీర్‌పేట్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, మొయినాబాద్‌ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీ, గోల్కొండకోట, తారామతి బారాదరి, చౌమహల్లా ప్యాలెస్‌, చార్మినార్‌ వంటి ప్రముఖ ప్రాంతాలు.. అనంతగిరి హిల్స్‌, అరకులోయ, విశాఖపట్టణం సముద్రతీరం, భద్రాచలం, కి¨న్నెరసాని నదీతీరాలు.. గోవా, హంపీ వంటి ప్రాంతాలకు ఎంపిక చేసుకుంటున్నారు. బడ్జెట్‌ను బట్టి రూ.10 లక్షల వరకూ కేటాయిస్తున్నవారు కూడా ఉంటున్నారు.


అభిరుచులు తెలుసుకోవచ్చు
- శృతి, డైరెక్టర్‌ మాయాబజార్‌ స్టూడియో, శామీర్‌పేట్‌

సినిమాల్లో తాము చూసిన దృశ్యాల్లో తామే కనిపించేందుకు కాబోయే భార్యాభర్తలు ఇష్టపడుతుంటారు. రెండు కుటుంబాలు కలసి రావటంతో వధూవరుల ఫొటో షూటింగ్‌ను ఆస్వాదిస్తారు.  కేవలం ఫొటోలు, వీడియోలకు పోజులివ్వటమే కాదు.. జీవిత భాగస్వామి అభిరుచులు తెలుసుకునేందుకూ వీలుంటుంది. గతంతో పోల్చితే డిమాండ్‌ పెరిగింది.. ఎంతోమందికి ఉపాధి దొరుకుతోంది. మున్ముందు ఇదొక పరిశ్రమగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


ఐదేళ్లుగా పెరుగుతోంది
- పీసీ శేఖర్‌, స్టూడియో నిర్వాహకులు

మధుర జ్ఞాపకం మదిని కట్టి పడేసేలా ఉండాలనుకుంటోంది నేటి యువతరం. ఇందుకు వేడుకల అనంతరం, ముందు తమ ఆలోచనలకు అనుగుణంగా లఘుచిత్రాల రూపకల్పనకు మక్కువ చూపుతున్నారు. ఐదేళ్ల నుంచి ఈ తరహా ధోరణి ప్రారంభమైంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది.


జీవితకాలం జ్ఞాపకాలు
- సంతోష్‌, అనూష జంట, కాకినాడ

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ గొప్ప అనుభూతి మిగిల్చింది. నచ్చిన ప్రదేశాల్లో ఇష్టమైన జీవితభాగస్వామితో విహారాల వంటివన్నీ జీవితకాలం మిగిలే అద్భుతమైన జ్ఞాపకాలు. ఈ సందర్భంలో ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకునేందుకు చక్కటి అవకాశం ఉంటుంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని