బొగ్గు ధరలు భగ్గు

ప్రధానాంశాలు

బొగ్గు ధరలు భగ్గు

టన్నుకు రూ.300 పెంచిన సింగరేణి
తెలంగాణ విద్యుత్కేంద్రాలపై రూ.200 కోట్ల భారం

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో నెలకొన్న బొగ్గు కొరత విద్యుత్కేంద్రాలపై ఆర్థిక భారం పెంచుతోంది. సింగరేణి సంస్థ బొగ్గు ధరలను పెంచింది. గతేడాది(2020 మార్చి)తో పోలిస్తే టన్నుపై గరిష్ఠంగా రూ.300 దాకా పెరిగింది. ఇది ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చింది.  గత మార్చిలో ఒకసారి పెంచగా, తాజాగా ఈ నెలలో మరోసారి పెంచింది. దీంతో తెలంగాణలోని విద్యుత్కేంద్రాలపై బొగ్గు కొనుగోలుకు ఏడాదికి రూ.200 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేంద్రాలకు ఇది ‘గోరుచుట్టుపై రోకలి పోటు’లా మారనుంది. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు, ఉద్యోగుల జీతభత్యాలు, గనుల తవ్వకాల ఖర్చులు పెరుగుతున్నందున ధరలు పెంచినట్లు సింగరేణి చెబుతోంది. మరోవైపు ధరల పెంపుపై కేంద్ర బొగ్గుశాఖకు కోల్‌ ఇండియా సైతం తాజాగా ప్రతిపాదనలు పంపింది.

రోజుకు 1.75 లక్షల టన్నుల సరఫరా

ఈ నెలలో రోజుకు లక్షా 93 వేల టన్నులకు బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ నుంచి ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని పలు విద్యుత్కేంద్రాలకు రోజుకు లక్షా 75 వేల టన్నులకు పైగా సరఫరా అవుతోంది. సాధారణంగా ఉత్పత్తిలో 95 శాతం విద్యుత్కేంద్రాలకు సంస్థలకు, మిగతాది ఇనుము, సిమెంటు వంటి పరిశ్రమలకు అమ్ముతారు. విద్యుత్కేంద్రాలతో పోలిస్తే మిగతా వాటికి టన్నుపై అదనంగా రూ.150 వసూలు చేస్తారు. ప్రస్తుతం బొగ్గు కొరత నేపథ్యంలో 100 శాతం విద్యుత్కేంద్రాలకే ఇస్తున్నారు.

బొగ్గును విద్యుత్కేంద్రంలో మండిస్తే ఎంత ఉష్ణం పుడుతుందో కిలో కేలరీల్లో లెక్కించి నాణ్యతను నిర్ణయిస్తారు. మండే స్వభావం బాగుంటే విద్యుదుత్పత్తి ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు జీ1 గ్రేడ్‌ బొగ్గుకు ‘స్థూల కేలొరిఫిక్‌ విలువ’(జీసీవీ) 7 వేల కిలో కేలరీలుంటుంది. దాని ధర టన్నుకు రూ.5210 నుంచి రూ.5430 వరకు నిర్ణయించారు. జీసీవీ 2201 కిలో కేలరీలుండే జీ17 గ్రేడ్‌ ధర రూ.1200 మాత్రమే.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని