తక్షణం ధాన్యం కొనుగోళ్లు

ప్రధానాంశాలు

తక్షణం ధాన్యం కొనుగోళ్లు

ప్రాధాన్య క్రమంలో కేంద్రాల ఏర్పాటు
135 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా
ధాన్యం తీసుకున్న 15 రోజుల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వాలి
వానాకాలం ధాన్యం కొనుగోళ్ల విధానం ఖరారు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమయింది. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంటవచ్చే జిల్లాల్లో వీటిని ప్రాధాన్య క్రమంలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వానాకాల వ్యవసాయ సీజనులో 135 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రాథమికంగా అంచనావేసింది. ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించినా, రీసైకిల్డ్‌ బియ్యాన్ని కస్టం మిల్లింగ్‌ బియ్యం కింద ఇచ్చేందుకు ప్రయత్నించినా మిల్లర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని, గతంలో గడువులోగా బియ్యం ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. వానాకాల ధాన్యం సేకరణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఖరారు చేసింది. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర మేరకు ధాన్యం కొనుగోళ్లు చేయాలని నిర్ణయించింది. ఏ-గ్రేడు ధాన్యం క్వింటాకు రూ.1,960, సాధారణ రకం రూ.1,940కు కొననుంది. నిల్వలు పుష్కలంగా ఉన్న కారణంగా ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌) తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో మిల్లర్లు కేటాయించిన ధాన్యం నుంచి సాధారణ బియ్యం (రా రైస్‌) మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది.

ధాన్యం సేకరణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఛైర్మన్‌గా కమిటీని ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ శాఖ కమిషనర్‌, డీజీపీ నియమించిన పోలీసు అధికారి, సీడబ్ల్యూసీ ఛైర్మన్‌, ఎస్‌డబ్ల్యూసీ డైరెక్టర్‌ సెర్ప్‌ సీఈవో, సహకార శాఖ అధికారి, ఎఫ్‌సీఐ జీఎంలు సభ్యులుగా ఆ కమిటీలో ఉంటారు. ధాన్యం సేకరణలో అక్రమాలు జరుగుతున్నట్లు రైతులు భావిస్తే ఫిర్యాదులకు 1800 425 00333, 1967 నంబర్లను కేటాయించినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవీ మార్గదర్శకాలు

* కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మిల్లులకు చేరిన రోజు నుంచి 15 రోజుల వ్యవధిలో బియ్యం ఇవ్వాలి.

* గడువులోగా ఇవ్వకపోయినా, నెమ్మదిగా మిల్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించినా ధాన్యాన్ని ఇతర మిల్లులకు తరలించాలి.

* రావాల్సిన బియ్యం విషయంలో రోజువారీగా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలి.

* మిల్లుల సామర్థ్యం మేరకు ధాన్యం కేటాయించాలి. కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న మిల్లులకే ధాన్యాన్ని ఇవ్వాలి.

* ధాన్యం కొనుగోలు, బియ్యం సరఫరా, తేమ, నూకలు తదితర విషయాల్లో గత సీజనులో ఉన్న నిబంధనలే వర్తిస్తాయి.  

* రాష్ట్రంలోని రేషన్‌కార్డు దారులకు, వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా 18 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. ప్రభుత్వ, ప్రజల అవసరాలకు కావాల్సిన బియ్యం కన్నా అదనంగా వచ్చిన వాటిని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి అందచేయాలి.

* ఎంపిక చేసిన జిల్లాల్లో పోషకాహారం కింద కార్డుదారులకు ఇచ్చే బియ్యంలో బలవర్ధక పోషకాలున్న బియ్యాన్ని కలిపి ఇవ్వాలి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని