మాదక ద్రవ్యాల కట్టడికి కార్యాచరణ

ప్రధానాంశాలు

మాదక ద్రవ్యాల కట్టడికి కార్యాచరణ

గత ఏడాదిలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు
అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పోడుభూముల సమస్య పరిష్కారం, హరితహారం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారు. మాదక ద్రవ్యాల దందాను అరికట్టేందుకు పటిష్ఠ వ్యూహాన్ని రూపొందించే దిశగా చర్యలకు ఉపక్రమించారు. పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో ఈనెల 20న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే పోడు భూముల సమస్యపై 23న అధికారులతో భేటీ కానున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతుండటంతో రాష్ట్రంలో వీటిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించనున్నారు. గుడుంబా, పేకాట నియంత్రణలో ఉన్నా.., అక్కడక్కడ కనిపిస్తుండటంపై మరింత కఠినంగా వ్యవహరించే అంశంపైన చర్చించనున్నారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని జిల్లా ఎక్సైజ్‌ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి హోంశాఖ, ఎక్సైజ్‌ శాఖల మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరవుతారు.

అడవుల పరిరక్షణపై సమగ్ర కార్యాచరణ

పోడు భూముల సమస్య పరిష్కారంతో పాటు అడవుల పరిరక్షణ, హరితహారంపై చర్చించేందుకు ఈనెల 23న ఉదయం 11.30 గంటల నుంచి కలెక్టర్లు, అటవీశాఖ అధికారులతో సమావేశమవుతారు. పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, అడవి తరిగిపోకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించి సమగ్ర కార్యాచరణకు రూపొందించాలని నిర్ణయించారు. హరితహారం ఫలితాలను అంచనా వేయడంతో పాటు, పటిష్ఠ అమలుపైన చర్చిస్తారు. ఇందులో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకరరావు, సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కన్జర్వేటర్లు, డి.ఎఫ్‌.ఒ.లతో పాటు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు పాల్గొంటారు. ఈక్రమంలో తొలుత పోడు భూముల సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఈనెల 20, 21 తేదీల్లో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజనశాఖ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ ఛొంగ్తు, అటవీశాఖ ప్రధాన అధికారి శోభలతో కూడిన బృందం హెలికాప్టర్‌లో అటవీ ప్రాంతాలకు వెళ్లనున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష  

ధాన్యం కొనుగోలు కోసం గడిచిన ఏడాది ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారో ఈసారి కూడా అన్నింటినీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. వానాకాల ధాన్యం కొనుగోళ్లపై ప్రగతి భవన్‌లో సోమవారం సాయంత్రం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసారి కూడా గతంలోలా 6,545 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యాన్ని శుభ్రం చేసి, నిబంధనల మేరకు తేమ తగ్గించి కేంద్రాలకు తేవాలని సీఎం రైతులను కోరారు. సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌, సీఎం కార్యాలయ అధికారులు నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్‌ పాల్గొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని