దేవాదుల సొరంగం పనుల పూర్తి

ప్రధానాంశాలు

దేవాదుల సొరంగం పనుల పూర్తి

ఆసియాలోనే అతిపెద్దది
49 కిలోమీటర్ల మేర తవ్వకం
వచ్చే ఏడాదిలో నీటి విడుదల
ఈనాడు - వరంగల్‌

దేవాదుల జల సొరంగం పనులు పూర్తయ్యాయి. 49.06 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం ఆసియాలోనే అతిపెద్ద హైడ్రాలిక్‌ టన్నెల్‌గా ఇంజినీర్లు చెబుతున్నారు. ఈఎత్తిపోతల పథకంలోని మూడో దశ, మూడో ప్యాకేజీ కింద పనులు చేపట్టారు. తొలుత రామప్ప చెరువు నుంచి ధర్మసాగర్‌ చెరువు వరకు సుమారు 55 కిలోమీటర్ల పొడవున తవ్వాలని నిర్ణయించి.. 2008లో పనులు ప్రారంభించారు. ఈతవ్వకం వల్ల రామప్ప ఆలయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని జియో ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం చెరువు నుంచి 7 కిలోమీటర్ల దూరం పైపులైన్‌ను వేసి, ములుగు జిల్లా జాకారం నుంచి సొరంగాన్ని హనుమకొండ జిల్లా దేవన్నపేట వరకు తవ్వాలని నిర్ణయించింది. 2011లో చలివాగు కింద పనులు జరుగుతున్న క్రమంలో బుంగ పడి పనులు చేస్తున్న ముగ్గురు జలసమాధి అయ్యారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో రూ.1494 కోట్ల అంచనాతో పనులు పునఃప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ‘మేఘా’ సంస్థకు బాధ్యతలను అప్పగించింది. సాఫ్ట్‌రాక్‌ కావడంతో పనులు చేపట్టడం ఇంజినీర్లకు సవాలుగా మారింది. తవ్వకం, నిర్వహణ కోసం ఏడు షాఫ్ట్‌లు, 10 ఆడిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. తాజాగా జాకారం వద్ద 3 మీటర్ల మేర గుల్ల బారడం(కేవిటీ)తో ఇంజినీర్లకు మరోసారి ఇబ్బంది ఎదురైంది. ఇనుప గడ్డర్లు పెట్టి రాళ్లు కూలకుండా పనులు చేపట్టి మొత్తం తవ్వకం పూర్తి చేశారు. మిగిలిన లైనింగ్‌ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని, వచ్చే ఏడాది ప్రారంభంలో వెట్ రన్‌ నిర్వహిస్తామని వరంగల్‌ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీరు సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సొరంగం అందుబాటులోకి వస్తే ఏడాదికి సుమారు 50 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని