ఆర్టీసీకి దసరా కాసుల పంట

ప్రధానాంశాలు

ఆర్టీసీకి దసరా కాసుల పంట

ప్రత్యేక బస్సులతో రూ. 3.3 కోట్ల ఆదాయం

ఒక్కరోజే రూ. 14.79 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీకి దసరా కాసుల పంట పండించింది. పండగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య ప్రాంతాలకు సుమారు 3వేల ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడిపింది. 4,600 సాధారణ బస్సులకు అదనంగా వీటిని తిప్పింది. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక బస్సుల ద్వారా రూ.3.3 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించింది. ఈసారి కరోనా కారణంగా సాధారణ ఛార్జీలనే వసూలు చేసినప్పటికీ భారీ ఆదాయం రావడం విశేషం. సాధారణ రోజులతో పోలిస్తే సోమవారం ఆదాయం ఎక్కువగా వస్తుంది. గత సోమవారం రికార్డుస్థాయిలో రూ.14.79 కోట్లు వచ్చిందని ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్‌ మంగళవారం ప్రకటించారు. గత ఆగస్టు నుంచి ఒక్క రోజే ఇంత పెద్దమొత్తంలో రావడం ఇదే తొలిసారి.

అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల జీతాల పెంపు

రాష్ట్ర ఆర్టీసీలో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న కార్మికులకు తీపి కబురు. వారి వేతనాలను సవరిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి నవంబరు 1 నుంచి కార్యరూపంలోకి వస్తాయని పేర్కొంది. ఏకీకృత వేతనం (కన్సాలిడేటెడ్‌ వేజెస్‌) విధానంలో పదవీ విరమణ చేసిన ఆర్టీసీ కానిస్టేబుళ్ల వేతనంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

ఆర్టీసీలో క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరో వెసులుబాటు కల్పించింది. టికెట్ల కొనుగోలు కోసం హైదరాబాద్‌లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్‌)లో యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. లాంఛనంగా నూతన విధానాన్ని మంగళవారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. టికెట్లు, పార్సిల్‌, కార్గో సేవలకు ఈ విధానం ద్వారా చెల్లింపులు చేయవచ్చన్నారు. రేథిఫైల్‌ బస్‌స్టేషన్‌లోనూ బస్‌పాస్‌ కౌంటర్‌లో యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు జరపవచ్చని తెలిపారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని