కృష్ణా బోర్డు మార్గదర్శకాలపై తెలంగాణ అభ్యంతరం

ప్రధానాంశాలు

కృష్ణా బోర్డు మార్గదర్శకాలపై తెలంగాణ అభ్యంతరం

శ్రీశైలం.. సాగర్‌ ప్రొటోకాల్స్‌ ‘బచావత్‌’ అవార్డుకు లోబడి లేవు
సవరించాలని ఛైర్మన్‌కు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రూపొందించిన మార్గదర్శకాలు కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-1 (బచావత్‌) అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. వాటిని సవరించాలని నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌.. బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌కు గురువారం లేఖ రాశారు.

లేఖలో అంశాలివీ...
‘‘కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలుకు వీలుగా కృష్ణా బోర్డు.. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ విధానాలను రూపొందించి తెలంగాణ ప్రభుత్వానికి  అందజేసింది. దానిపై అధ్యయనం చేసిన ప్రత్యేక కమిటీ.. ఆ నిర్వహణ విధానాలు బచావత్‌ అవార్డుకు అనుగుణంగా లేవని అభిప్రాయ పడింది. వేరే బేసిన్‌కు ఎటువంటి నీటిని మళ్లించకుండా కేవలం జల విద్యుత్‌ ఉత్పత్తిని మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టులో చేపట్టాలని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-1 (కేడబ్ల్యూడీటీ-1) సూచిస్తోంది. కేఆర్‌ఎంబీ, కేంద్ర ప్రభుత్వాలకు ట్రైబ్యునల్‌ అవార్డులో జోక్యం చేసుకునే అధికారాలు లేవు. కేడబ్ల్యూడీటీ-2 నీటి కేటాయింపులు అమల్లోకి వచ్చేదాక కేడబ్ల్యూడీటీ-1 ప్రకారం కృష్ణా జలాల పంపిణీని అనుసరించక తప్పదు. రూల్‌ కర్వ్స్‌ ప్రకారం శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకోవాల్సిన నీటి వాటా 34 టీఎంసీలు. 2014-15 నుంచి ఏడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ సగటు నీటి వినియోగం.. అవార్డును ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. ఆ రాష్ట్రం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీటిని కృష్ణా బేసిన్‌ అవతలికి మళ్లిస్తూ దానిని అధికారికం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

* నాగార్జునసాగర్‌కు ప్రత్యేకంగా పరీవాహక ప్రాంతం లేదు. ఈ ప్రాజెక్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి అవసరాలను తీర్చుతోంది. సాగర్‌కు ప్రధాన నీటి వనరు శ్రీశైలం జలాశయమే. అవార్డు ప్రకారం ఈ రెండు జలాశయాలను నీటి నిల్వ చేసుకునేందుకు తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది’’ అని లేఖలో రజత్‌కుమార్‌ వివరించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని