సైబర్‌ భద్రతపై త్వరలో కొత్త చట్టం: మంత్రి కేటీఆర్‌

ప్రధానాంశాలు

సైబర్‌ భద్రతపై త్వరలో కొత్త చట్టం: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరాలను అరికట్టి.. భద్రత కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా కొత్త చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2016లో ముసాయిదా వచ్చిందని, దానికి నల్సార్‌ విశ్వవిద్యాలయంలో చట్ట రూపకల్పన జరుగుతోందని పేర్కొన్నారు. సైబర్‌ భద్రత నిపుణులు, సంస్థల సలహాలు, సూచనలు సైతం స్వీకరిస్తామని చెప్పారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సైబర్‌ భద్రత సంస్థ ఇవాంటి హైదరాబాద్‌లో తమ సంస్థ విస్తరణపై గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘‘సైబర్‌ భద్రత, డేటా ప్రైవసీ అనేవి ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు. ఆధునిక సాంకేతికత సాయంతో నేరుగా అనేక ఉపకరణాలతో అనుసంధానమవుతున్నా.. వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలకు సైబర్‌ భద్రత పెనుసవాల్‌గా మారింది. సాధ్యమైనంత మేరకు సైబర్‌ ఉల్లంఘనల నిరోధమే మా ప్రభుత్వ లక్ష్యం. భద్రతతో కూడిన సురక్షితమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడానికి ఇవాంటి వంటి కంపెనీలు కేంద్రాలను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఇవాంటి హ్యాకథాన్‌లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి అవుతుంది. కొత్తగా తీసుకునే వారిలో సగం మంది స్థానికులకు అవకాశాలివ్వాలి’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇవాంటి సైబర్‌ భద్రత ప్రతిభా కేంద్రం సీఈవో శ్రీరామ్‌ బిరుదవోలు మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక, ప్రతిభాశక్తి కేంద్రంగా బలోపేతం చేస్తామని, వచ్చే రెండేళ్లలో కొత్తగా ఒక ఆవిష్కరణ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను రెండు వేలకు పెంచుతామని తెలిపారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌ గ్రూప్‌ అధ్యక్షురాలు, ఇవాంటి చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ నాయకి నయ్యర్‌, సైబర్‌ సెక్యూరిటీ వర్క్స్‌ ఛైర్మన్‌, సహవ్యవస్థాపకుడు రామ్‌ మొవ్వ, సెక్యూరిటీ ప్రొడక్ట్స్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ ముక్కామల తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని