ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు

ప్రధానాంశాలు

ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు

గంట ముందు నుంచే విద్యార్థులకు అనుమతి
వ్యాక్సినేషన్‌ పూర్తయిన సిబ్బందితోనే పర్యవేక్షణ
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈనెల 25 నుంచి నవంబరు 3 వరకు జరగనున్న పరీక్షల ఏర్పాట్లపై గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1768 కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. మొత్తం 4,59,228 విద్యార్థులు హాజరు కానున్నారని, వారిని గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. మంచినీళ్ల సీసాలను, శానిటైజర్లను లోపలకు తెచ్చుకోవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు ముందు, తర్వాత బెంచీలు, తలుపులు, కిటికీలను శానిటైజ్‌ చేయాలని ఆదేశించారు. ప్రతీ విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తామని, మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. 70శాతం సిలబస్‌తోనే ప్రశ్నపత్రం రూపొందించామని, ఇందుకు సంబంధించిన సిలబస్‌ను, మాదిరి ప్రశ్నపత్రాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ప్రశ్నల్లో ఛాయిస్‌ను కూడా పెంచామన్నారు. కేంద్రాల్లో పర్యవేక్షకుల నుంచి అటెండర్ల వరకు అందరినీ వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారినే నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా మానిటరింగ్‌, హైపవర్‌ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. విద్య, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్యారోగ్యం, విద్యుత్తు, పోస్టల్‌ శాఖల అధికారులతో సమన్వయ కమిటీల సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని