విద్యుత్తు ఒప్పందాలను సవరిస్తే మూల్యం చెల్లించాల్సిందే!

ప్రధానాంశాలు

విద్యుత్తు ఒప్పందాలను సవరిస్తే మూల్యం చెల్లించాల్సిందే!

చట్టాలు, పన్నుల విధానాన్ని మార్చినా నష్టాలకు బాధ్యత వహించాలి

ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని తగ్గించినా పరిహారమివ్వాల్సిందే

రాష్ట్రాల చర్యలకు చెక్‌ పెట్టేలా కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు

ఈనాడు, దిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కుదిరిన తర్వాత ఉత్పత్తి సంస్థలను ఇబ్బందులు పెట్టేవిధంగా చట్టాలు, నిబంధనలు, పన్నుల విధానాన్ని మారుస్తుండటంతో అటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసేలా కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొనుగోలు ఒప్పందాలు కుదిరి, విద్యుత్తు చట్టంలోని సెక్షన్‌ 62, 63 ప్రకారం టారిఫ్‌ నిర్ధారణ కూడా పూర్తయిన తర్వాత ప్రభుత్వాలు చేసిన సవరణల వల్ల ఉత్పత్తి సంస్థలకు కలిగే నష్టాన్ని అందుకు కారకులైన వారే భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. కొత్త విద్యుత్తు నిబంధనలు-2021 (టైమ్‌లీ రికవరీ ఆఫ్‌ కాస్ట్స్‌ డ్యూ టూ ఛేంజ్‌ ఇన్‌ లా) పేరుతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్త చట్టం తెచ్చినా, ఉన్నది రద్దుచేసినా, లేదా సవరించినా దానివల్ల విద్యుత్తు ఉత్పత్తి సంస్థలపై పడే దుష్ప్రభావానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నెలవారీ టారిఫ్‌ను సవరించి దాని ద్వారా సమకూరే మొత్తంతో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు జరిగిన నష్టాన్ని భర్తీచేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్ట సవరణ వల్ల జరిగే నష్ట ప్రభావాన్ని లెక్కించి ఆ వివరాలను బాధిత సంస్థ తనతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు 30 రోజుల్లోపు అందించాలని పేర్కొంది. దాని ప్రకారం వచ్చే బిల్లింగ్‌ సైకిల్‌ నుంచే నష్ట మొత్తాలను తిరిగి వసూలుచేసుకోవడం ప్రారంభమవుతుందని తెలిపింది. నష్ట ప్రభావాన్ని లెక్కించడానికి ఈ నోటిఫికేషన్‌లో సూత్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. చట్టంలో మార్పు ప్రభావం కేవలం నిర్ణీత మొత్తంపై పడితే దాన్ని 180 రోజుల్లో భర్తీచేయాలని, ఒకవేళ ప్రభావం పునరావృతమైతే దాన్ని భర్తీచేయడానికి అవసరమైనంత కాలం టారిఫ్‌ను సవరించాలని కేంద్ర విద్యుత్తుశాఖ పేర్కొంది.

* కొత్త విద్యుత్తు నిబంధనలు-2021(ప్రమోషన్‌ ఆఫ్‌ జనరేషన్‌ ఆఫ్‌ ఎలెక్ట్రిసిటీ ఫ్రం మస్ట్‌-రన్‌ పవర్‌ ప్లాంట్‌)ని కూడా కేంద్రం విడుదల చేసింది. పవన, సౌర, ఆ రెండూ కలగలిసిన హైబ్రిడ్‌, జల విద్యుత్తు కేంద్రాలు(నీరు వృథాగా పోతున్న సమయంలో) ఎవరికైనా విద్యుత్తు విక్రయించడానికి ఒప్పందాలు చేసుకొని ఉంటే వాటన్నింటినీ తప్పనిసరిగా విద్యుదుత్పత్తి చేయాల్సిన (మస్ట్‌రన్‌) కేంద్రాలుగా పరిగణించాలని కేంద్రం పేర్కొంది. తక్కువ ధరకు లభించే విద్యుత్తుకు ప్రాధాన్యం(మెరిట్‌ ఆర్డర్‌ డిస్పాచ్‌) ఆధారంగా కానీ, ఇతర వాణిజ్య అంశాలను పరిగణనలోకి తీసుకొని కానీ వీటి ఉత్పాదక శక్తిని తగ్గించరాదు, నియంత్రించరాదని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యుత్తు గ్రిడ్‌కు భద్రతాపరమైన సమస్యలు తలెత్తితే మినహా ఆయా విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తిని నియంత్రించడానికి వీల్లేదని పేర్కొంది. ఒకవేళ విద్యుదుత్పత్తిదారు నుంచి సరఫరాను నియంత్రిస్తే కొనుగోలుదారు అందుకు సంబంధించిన పరిహారాన్ని నష్టపోయిన సంస్థలకు చెల్లించాలని కేంద్రం తెలిపింది. ఒకవేళ విద్యుత్తు గ్రిడ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా విద్యుత్తు ఉత్పత్తిని నియంత్రించాల్సి వస్తే అందుకు సంబంధించి ఒకరోజు ముందుగానే నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది.

* తాము తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల భారీ పెట్టుబడులు పెట్టి విద్యుత్తు సంస్థలు ఏర్పాటు చేసిన వారికి భద్రత చేకూరుతుందని కేంద్రం పేర్కొంది. దేశంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుందని తెలిపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడానికి దోహదపడుతుందనే విశ్వాసం వ్యక్తం చేసింది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని