ఉద్యోగ ఖాళీలు 60 వేలపైనే..!

ప్రధానాంశాలు

ఉద్యోగ ఖాళీలు 60 వేలపైనే..!

నేడు మంత్రిమండలి ముందుకు వివరాలు  

‘దళితబంధు’ విధివిధానాలకు ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 60 వేలకుపైగా ఉన్నట్లు గుర్తించిన వివిధ శాఖలు ప్రభుత్వానికి నివేదించగా.. ఆ వివరాలు ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగే మంత్రిమండలి సమావేశంలో సమర్పించనున్నట్లు తెలిసింది. కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా పోస్టులు, ఖాళీలతో గుర్తించి ఇచ్చిన ఈ వివరాలను సీఎం, మంత్రులు పరిశీలించి ఆమోదం తెలిపాక ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి మార్గం సుగమమౌతుంది. ఆగస్టు 15 నాటికి ఏదైనా ఒక నోటిఫికేషన్‌ వెలువరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళిత బంధు పథకం విధివిధానాలను మంత్రిమండలి ఖరారు చేయనుంది. హుజూరాబాద్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడానికి అనుమతిస్తూ ఉత్తర్వుల జారీకి అవకాశముంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్‌దారులకు అవసరమైన మొత్తాల విడుదలపై ఆదేశాలు జారీ చేయనుంది.

గెజిట్‌ నోటిఫికేషన్‌పై చర్చ: ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు దిశగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి బోర్డు... మొదటి సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై మంత్రిమండలి భేటీలో విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పోడు భూముల అంశంపైనా చర్చ జరగవచ్చని సమాచారం. వీటితో పాటు ఆదాయ సమీకరణ, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు, ఆయిల్‌ పామ్‌ సాగు, ఇతర పాలనాపరమైన అంశాలతో పాటు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ అంశాలపైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. కరోనా, ఇతర పరిస్థితుల నేపథ్యంలో ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేనందున దీర్ఘకాలిక కార్యాచరణతో ముందుకెళ్లాలని సీఎం నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. మంత్రిమండలి సమావేశం నేపథ్యంలో ‘దళితబంధు’పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రుల అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని