ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోం: రేవంత్‌రెడ్డి

ప్రధానాంశాలు

ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోం: రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా తక్కువ ధరకు భూములను అమ్ముతూ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాను చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా తప్పని తేలితే తనపై క్రిమినల్‌ కేసులు పెట్టుకోవచ్చని సవాల్‌ చేశారు. టెండర్‌ డాక్యుమెంట్‌, వేలంలో ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి, టెండర్లలో పాల్గొనడానికి పెట్టిన షరతులేంటో బయటపెట్టాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గచ్చిబౌలి ఐకియా కంపెనీ పక్కనున్న 7,621 గజాల సర్‌ప్లస్‌ సీలింగ్‌ ల్యాండ్‌ను ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు తక్కువ ధరకు రెగ్యులరైజ్‌ చేశారని ఆరోపించారు. ఆ భూమిని వారి మిత్రుల కంపెనీకి డెవలప్‌మెంట్‌కు ఇచ్చారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మౌలిక వసతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు కట్టేందుకు అనుమతులు ఇస్తున్నారన్నారు. కోకాపేటలో తక్కువ ధరకు విక్రయించిన భూములను కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకుంటుందని ఆయన స్పష్టంచేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం 260 మంది దళితులకు అక్కడ పట్టాలిచ్చిందని, ఇప్పుడు ఆ భూములనే విక్రయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ వేదికను కాదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఎందుకు టెండర్లు నిర్వహించిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులను గృహనిర్బంధం చేయడాన్ని రేవంత్‌రెడ్డి ఖండించారు. ప్రజలను వేధిస్తే పోలీస్‌స్టేషన్లకు తాళాలు వేసి దిగ్బంధిస్తామని హెచ్చరించారు. భూముల అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తుతానని భయపడి పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా తనను గృహనిర్బంధం చేశారని ఆయన ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని