కేంద్ర గెజిట్‌పై సుప్రీంలో కేసు వేయండి

ప్రధానాంశాలు

కేంద్ర గెజిట్‌పై సుప్రీంలో కేసు వేయండి

పాలమూరు-రంగారెడ్డి, డిండి వంటివి అనుమతి పొందిన ప్రాజెక్టులుగా అందులో లేవు
స్టే తెస్తేనే తెలంగాణకు న్యాయం
రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన ఉత్తమ్‌, కోమటిరెడ్డి

ఈనాడు, నల్గొండ: కృష్ణానదిపై ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ఉందని... దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేసి స్టే తీసుకురావాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలా చేసినప్పుడే కేసీఆర్‌ రాష్ట్రానికి న్యాయం చేసినవారవుతారన్నారు. నల్గొండలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టులను ప్రభుత్వం రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది. వీటిని అనుమతి పొందిన ప్రాజెక్టులుగా గెజిట్‌లో నమోదు చేయలేదు. అందువల్ల వీటికి నిధుల సమీకరణ కష్టమవుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోతుంది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు వెడల్పు పనులు చేస్తుంటే ఈ ప్రభుత్వం నిద్రపోయింది. ఇప్పుడు హడావుడి చేస్తోంది. ఇప్పటిదాకా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర గెజిట్‌ వల్ల రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎడారి అవుతాయి’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయాలి: కోమటిరెడ్డి
రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో కొట్లాడతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఒక్క హుజూరాబాద్‌ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేయాలన్నారు. లేదంటే త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ తరఫున దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. ‘‘నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు ముందు హామీ ఇచ్చిన విధంగా పంచాయతీలు, పురపాలికలకు ఇస్తామన్న నిధులు ఇవ్వాలి. కాంగ్రెస్‌ సర్పంచులకు నిధులు రాకుండా అడ్డుకుంటే సహించేది లేదు. అధికార పార్టీ ఎంపీల కన్నా నల్గొండ, భువనగిరి ఎంపీలమైన మేమే జాతీయ రహదారి విస్తరణ పనులకు నిధులు సాధించాం’’ అని కోమటిరెడ్డి అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని