హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ దళిత దండోరా

ప్రధానాంశాలు

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ దళిత దండోరా

ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు
ప్రభుత్వ అవినీతిపై నిరంతర పోరాటం
పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయాలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: దళిత బంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆరోపించింది. ఆ మోసాలన్నింటినీ బయటపెట్టాలని, ఇందులో భాగంగా ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ‘దళిత దండోరా’ చేపట్టాలని నిర్ణయించింది. దళిత, గిరిజన దండోరాల తర్వాత బీసీ దండోరా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది.  రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, కోకాపేట భూముల వేలంపై నిరంతరం పోరాటం చేయాలని తీర్మానించింది. భావసారూప్యం కలిగిన వారిని కాంగ్రెస్‌తో కలిసి రావాల్సిందిగా కోరాలనే అభిప్రాయానికి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. దీనికి కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ గౌడ్‌, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహా, కన్వీనర్‌ అజ్మతుల్లా హుస్సేన్‌ తదితరులు హాజరయ్యారు.

ప్రవీణ్‌కుమార్‌ వస్తానంటే స్వాగతిస్తాం
సమావేశం అనంతరం మధుయాస్కీ విలేకరులతో మాట్లాడుతూ.. ఇకపై తెరాస ప్రభుత్వ ప్రతి అవినీతిపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కోకాపేట భూముల అవినీతిపై ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ, సీబీఐలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోడు భూములు లాక్కోవడాన్ని అరికట్టడం కోసం అంజన్‌కుమార్‌యాదవ్‌, జగన్‌లాల్‌ నాయక్‌ నేతృత్వంలో కమిటీ వేశామని.. ఇందులో సీతక్క, పొదెం వీరయ్య, రాములు నాయక్‌, బెల్లయ్యనాయక్‌ సభ్యులుగా ఉంటారన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న నిరసనల్లో కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు మానవహక్కుల కమిషన్‌, కోర్టుల్లో ప్రైవేట్‌ కేసులు వేస్తామని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేసిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మధుయాస్కీ డిమాండ్‌ చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జి దామోదర రాజనర్సింహా మంగళవారం పర్యటిస్తారన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ కలిసి వస్తానంటే కాంగ్రెస్‌ స్వాగతం పలుకుతుందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం పోరాడిన కోదండరాం, చెరుకు సుధాకర్‌, గద్దర్‌, విమలక్కతో పాటు తెలంగాణ వాదులందరినీ తమతో చెయ్యి కలపాలని ఆహ్వానిస్తామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని