15లోపు దళిత బంధు డబ్బు ఇవ్వాలి

ప్రధానాంశాలు

15లోపు దళిత బంధు డబ్బు ఇవ్వాలి

సీఎం కేసీఆర్‌ ఈసారి తప్పించుకోలేరు

ఎస్సీ సమగ్ర అభివృద్ధిపై సదస్సులో మందకృష్ణ మాదిగ

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రకటించిన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆగస్టు 1న ప్రారంభించి 15లోపు పూర్తి చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. పథకం నగదును అక్కడి ప్రతి దళిత కుటుంబానికి చెల్లించాలన్నారు. ఆగస్టు 16 నుంచి నెలాఖరులోపు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఎస్సీ సమగ్ర అభివృద్ధి సాధనపై సదస్సు జరిగింది. రాష్ట్ర బేడ బుడగ జంగాల అధ్యక్షుడు చింతల రాజలింగం అధ్యక్షత వహించారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ హజూరాబాద్‌ ఉప ఎన్నికలో దళితుల ఓట్లు గంపగుత్తగా వేయించుకునేందుకు కేసీఆర్‌ వ్యూహం పన్నారన్నారు. ‘‘మరో నెల గడిపితే ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను చూపి తప్పించుకోవచ్చని కేసీఆర్‌ చూస్తున్నారు. ఈ దఫా ఆయన తప్పించుకోలేరు’’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో దళిత బంధు సాధనకు ఆగస్టు 1నుంచి రోజుకు రెండేసి ఉమ్మడి జిల్లాల్లో సభలు ఉంటాయని మందకృష్ణ తెలిపారు. 1న వరంగల్‌, కరీంనగర్‌; 2న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌; 3న మెదక్‌, రంగారెడ్డి; 4న హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌; 5న నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఉంటాయన్నారు. సెప్టెంబరు 5న హుజూరాబాద్‌లో దళిత గర్జన నిర్వహిస్తామని ప్రకటించారు. ఆగస్టు 16న ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభించి సభ నాటికి హుజూరాబాద్‌ చేరుకుంటామని తెలిపారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యులు రాములు, దళిత నేత జేబీ రాజు, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, వివిధ దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని